TDP Aims YCP : ఉత్తరాంద్రలో ఆ వైసీపీ నేతల్ని దువ్వుతోన్న టీడీపీ.!

TDP Aims YCP : 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుంచే సర్వసన్నద్ధంగా వుండాలని పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టమైన సంకేతాలు పంపుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పుడు పరిస్తితిని చంద్రబాబు సమీక్షిస్తున్నారు.

‘సమర్థవంతమైన నాయకత్వం’ అనే కోణంలో ‘ఫిల్టర్’ చేసే పనిలో చంద్రబాబు బిజీగా వున్నారంటూ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే, అసలు పార్టీలో అంత సమర్థవంతమైన నాయకులెక్కడున్నారు.? అన్న చర్చ కూడా లేకపోలేదు. సరే, రాజకీయాల్లో ఈక్వేషన్స్ రాత్రికి రాత్రి మారిపోతాయ్.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఉత్తరాంధ్రలో వైసీపీకి చెందిన కీలక నేతలకు టీడీపీ గాలం వేస్తోందట. సదరు నేతల్లో చాలామంది పదవుల కోసం ఎదురు చూసి దిగాలు పడ్డవారేనన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో ఇలాంటి ‘గాలమేసే’ వ్యవహారాలు సర్వసాధారణమే అయినా, టీడీపీ కాస్త ఈ విషయంలో తొందరపడుతున్నట్లే కనిపిస్తోంది.

కాగా, మంత్రి వర్గ విస్తరణ అంటూ జరిగితే పార్టీలో వుండేదెవరు.? ఊడేదెవరు.? అన్నదానిపై అధికారపక్షం అత్యంత వ్యూహాత్మకంగా పార్టీ ఇంటెలిజెన్స్ వ్యవస్థని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డికి ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదనపు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ మీద ఆయనకు సంపూర్ణమైన పట్టు వుంది. ఆయనే అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారట.

మంత్రి పదవి కోసం ఆశపడుతున్న ఓ ముఖ్య నేత, ఆ పదవి దక్కకపోతే పార్టీ మారడం ఖాయమని జిల్లా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.