ప్రైవేటు హాస్పిటల్ (రమేష్ హాస్పిటల్)లో వైద్య పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అనడంతో, వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కి.. ఇప్పుడు ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసేలా ఆదేశాలు రావడానికి కారణమయ్యింది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారానికి సంబంధించి ఈ ట్విస్టుని అధికార పార్టీకి ‘షాక్’ అనాలా.? ఇంకేమైనా అనాలా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రభుత్వంపై కుట్రపన్నారంటూ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రఘురామను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. పోలీసుల అదుపులో వున్నప్పుడు, రఘురామపై థర్డ్ డిగ్రీ అప్లయ్ చేశారన్న విమర్శలున్నాయి. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ కోర్టును ఆశ్రయించడంతో, గాయాల నిజాల్ని నిగ్గు తేల్చడానికి న్యాయస్థానం ప్రభుత్వాసుపత్రితోపాటు, ప్రైవేటు ఆసుపత్రిలోనూ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
ఆ ప్రైవేటు ఆసుపత్రి రమేష్ హాస్పిటల్ కావడంతో, కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం హుటాహుటిగా జైలుకు తరలించింది ఏపీ సీఐడీ. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఓ వైపు పిటిషన్ దాఖలు చేసిన రఘురామ తరఫు లాయర్లు, మరో వైపు వైద్య పరీక్షల విషయమై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం గమనార్హం. విచారణ అనంతరం సుప్రీంకోర్టు, సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. అంతే కాదు, తెలంగాణ హైకోర్టు, ఓ జ్యుడీషియల్ అధికారిని నియమించాలనీ, ఆ అధికారి సమక్షంలోనే వైద్య పరీక్షలు జరగాలనీ, దీన్ని జ్యుడీషియల్ కస్టడీగా భావించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు చేసింది. రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు చెప్పినా పట్టించుకోని ఏపీ సీఐడీ, ఇప్పుడు సుప్రీం తీర్పుపై ఎలా స్పందిస్తుంది.? అన్నది వేచి చూడాల్సిందే.