రాజకీయాల్లోకి రాజ్యాంగ వ్యవస్థలను లాగడం ఎంత తప్పో ఈరోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైంది. ఎన్నికలు నిర్వహించడం అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం. పద్దతి ప్రకారం ఈసీ ఎన్నికలు పెడతాను అంటే ప్రభుత్వం సహకరించి తీరాలి. అవసరమైతే సలహాలు, సూచనలు చేయవచ్చు. వాటిని కూడ ఈసీ పాటించి తీరాలనే రూలేమీ లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల విషయంలో ఈసీ నిర్ణయానికి రాజకీయ రంగు పులమబడింది. కేవలం పంతానికి పోయి ఈసీ మీద నెగ్గాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. రెండు ప్రధాన పార్టీల నడుమ యుద్ధం జరిగింది. ఎన్నికల కమీషనర్ ను టార్గెట్ చేశారు.
రాజకీయాలు కాబట్టి నాయకులు, పార్టీలు ఎప్పుడు ఎలాంటి విపరీతానికి పూనుకుంటాయో చెప్పలేం. రాజకీయం కాబట్టి ఏదైనా సరే త్వరగానే పాతబడిపోతుంది. కానీ ఈ వివాదాల్లోకి ఉద్యోగ సంఘాలు ప్రవేశిస్తే ఎలా ఉంటుంది. ఫలితం తీవ్రంగానే ఉంటుంది. ఇన్నాళ్లు పాలక పార్టీ ఏదైనా ప్రభుత్వ ఒత్తిళ్లకు ఉద్యోగులు తలొగ్గిన సంధర్భాలు అనేకం చూశాం. కానీ ఇప్పుడు మాత్రం ఉద్యోగ సంఘాలు పార్టీల మెప్పు కోసం ప్రయత్నించి తలబొప్పి కట్టించుకున్న వైనాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి మన్ననలు పొందాలనుకోవడంలో తప్పేం లేదు. ఆ మన్ననలు పనితనం చూపించి పొందొచ్చు. కానీ రాజకీయ పరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే సబబు కాదు.
పంచాయతీ ఎన్నికలు పెడితే సహకరించబోమని ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు పంపాయి. తాము విధుల్లో లేకుంటే ఎలా ఎన్నికలు పెడతారో చూస్తామన్నట్టు ప్రవర్తించాయి. ఉద్యోగ సంఘాల ధిక్కరణతో ప్రభుత్వానికి ఎన్నికలు వద్దనడానికి మంచి కారణం దొరికింది. అది ఊరికే దొరకలేదు. దొరికేలా చేశారు. కరోనా, వ్యాక్సినేషన్ కారణాలు చెప్పి ఎన్నికలు పెడితే మెరుపు సమ్మెకు దిగుతామన్నారు. ప్రభుత్వంతో సమానంగా హైకోర్టు డివిజినల్ బెంచ్ తీర్పు మీద సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశాయి ఉద్యోగ సంఘాలు. కానీ ఉద్యోగ సంఘాల తీరుపై సుప్రీం కోర్టు గట్టిగానే అక్షింతలు వేసింది.
ఎన్నికలు నిర్వహించడం అనేది ఎన్నికల కమిషనర్ యొక్క రాజ్యాంగ విధి అని ప్రస్తావిస్తూ, అసలు ఇందులో ఉద్యోగ సంఘాలు ఎందుకు కలుగజేసుకుంటున్నాయి. ఈసీని టార్గెట్ చేయాల్సిన పనేం వచ్చింది. కేరళలో కరోనా ఎన్నికలు పెట్టబట్టే పెరిగిందని ఎలా చెబుతున్నారు అంటూ ప్రశ్నించింది. ఎన్జీవోల మీద కూడ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగానే స్పందించింది. చట్టవ్యతిరేకంగా ఎన్జీవోలు వ్యవహరిస్తున్నాయి. కరోనా ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారు. కరోనా ప్రభావం తగ్గాక ఎన్నికలు వద్దంటున్నారు. ఎన్నికలు వాయిదా వేస్తూ వెళ్లడం సరికాదు అన్నారు జస్టిస్. ఈ ఎపిసోడ్ పార్టీలకు కనువిప్పు అయినా కాకపోయినా ఉద్యోగ సంఘాలకు మాత్రం కొత్త పాఠాన్ని నేర్పాయి.
ప్రలోభాలకు లొంగి పనులు చేయడం ఎంత ఇబ్బందో ప్రలోభాలకు లొంగి రాజ్యాంగ వ్యవస్థలకు ఎదురుతిరగడం అంతకుమించిన ఇబ్బందేనని తెలిసొచ్చింది. ఉద్యోగ సంఘాలు తమ హక్కులకు భంగం కలిగితేనో, జీతాలు రానప్పుడో, ఖాళీలు భర్తీ కానప్పుడో, ఉదేశ్యపూర్వకంగా పనిభారం పెంచితేనో, తమ అవసరాలను తెలపాల్సి వచ్చినప్పుడో బయటకు రావాలి, పోరాడాలి. అంతేకానీ ఇలా రాజ్యాంగ వ్యవస్థకు రాజకీయాలకు పోటీ జరిగేటప్పుడు కాదు. అలా వస్తే ఏమవుతుందో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనాలు.