రోడ్లపై గోతులు.. చంద్రబాబు కాలం నాటివట.!

వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రోడ్లపై గుంతల వ్యవహారానికి సంబంధించి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ళ కాలంలో చంద్రబాబు రోడ్లను సరిచేయలేదనీ, ఆ కారణంగానే రోడ్లపై గుంతలు ఇప్పటికీ వున్నాయని సెలవిచ్చారు. అంతలోనే భారీ వర్షాల కారణంగానే రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు సజ్జల. ఏది వాస్తవం.? చంద్రబాబు హయాంలోనే గోతులు ఏర్పడి వుంటే, వైఎస్ జగన్ ప్రభుత్వం, గడచిన రెండేళ్ళలో ఏం సాధించినట్లు.? ఓ రాష్ట్రంలో కావొచ్చు, ఓ దేశంలో కావొచ్చు.. లేదంటే ఓ నగరంలో కావొచ్చు.. రోడ్లు బావుంటేనే, అక్కడ అభివృద్ధి సాధ్యపడుతుంది. ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటేనే ఇతర రాష్ట్రాలకు చెందినవారు భయపడుతున్నారంటే, అక్కడ రోడ్లు ఎలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.

రోడ్లు బాగాలేవంటే, అది పూర్తిగా ఆ రాష్ట్ర వైఫల్యమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. రోడ్ల అభివృద్ధి కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం, పెట్రోలు అలాగే డీజిల్ మీద ప్రత్యేకంగా సుంకం విధిస్తోంది. ఆ సొమ్ములన్నీ ఏమైపోతున్నట్లు.? అధికారంలోకి వచ్చాక, కనీసం రోడ్లను బాగు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టలేకపోయిందంటే.. అది పూర్తిస్థాయిలో ప్రభుత్వ వైఫల్యమే. చంద్రబాబు పాలన గడిచిపోయింది.. ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేశారు. టీడీపీ కోలుకునే పరిస్థితుల్ల్లో లేదు కూడా. ఒకవేళ టీడీపీ అంటు కోలుకుంటే, దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది వైసీపీనే. ఎందుకంటే వైసీపీ వైఫల్యమే టీడీపీ ఎదుగుదల అవుతుంది. చీటికీమాటికీ టీడీపీని విమర్శించడం ద్వారా వైసీపీ తన వైఫల్యాల్ని తానే ఒప్పుకుంటున్నట్లవుతోంది. ఔను మరి, చంద్రబాబు హయాంలో రోడ్లకు గుంతలు పడ్డాయని సజ్జల చెప్పడం ద్వారా, రెండేళ్ళలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న విషయాన్ని ఒప్పుకున్నట్టేగా.?