ఏపీ ఎన్నికల బరిలో వారసులు వీరే… ఈసారి ఎవరికి ఛాన్స్?

ఏపీలో మే 13న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి గెలిచి సత్తా చాటాలని వైసీపీ భావిస్తుండగా.. ఈసారి ఎలాగైనా గెలిచి, నిలవాలని బాబు & కో భావిస్తున్నారు. నేపథ్యంలో ఈసారి ఆయా పార్టీల తరఫున కొంతమంది నేతల వారసులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో గెలిచేవారు ఎంతమందనే చర్చ బలంగా మొదలైంది.

అవును… పొత్తులో భాగంగా ఈసారి కొంతమంది కోరుకున్న టిక్కెట్లు ఇవ్వలేకపోయినా వారి వారి వారసులకు మాత్రం టిక్కెట్లు ఇచ్చారు చంద్రబాబు. ఇదే క్రమంలో భారీ ఎత్తున అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపట్టిన జగన్ కూడా కొంతమంది వారసులకు ఈసారి అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వీరు ఏ మేరకు ప్రభావం చూపిస్తారనేది ఆసక్తిగా మారింది.

ఇందులో ప్రధానంగా… గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మరోసారి బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయి… ఓటమే కాదు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన పూర్తిగా మంగళగిరికే పరిమితమయ్యారని అంటున్నారు.

ఈ క్రమంలో… ఆయనపై మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు, మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కోడలు అయిన లావణ్యను వైసీపీ బరిలోకి దించింది. దీంతో… వారసులు పోటీ పడుతున్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఈ ఇద్దరిలో గెలుపెవరిదనేది ఆసక్తిగా మారింది.

ఇక అదే జిల్లాలోని తెనాలిలో ఇద్దరు వారసులు బరిలో ఉన్నారు. ఇందులో భాగంగా… మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తుండగా.. మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ కుమారుడు అన్నాబత్తుని శివకుమార్‌ వైసీపీ తరఫున బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో శివకుమార్‌ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను మట్టికరిపించి.. మరోసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున బరిలో ఉన్న నాదెండ్ల మనోహర్‌.. మూడు పార్టీల జనాలూ తనకు ఓటు వేస్తే విజయం తనదేననే ధీమాలో ఉన్నారు.

ఇదే క్రమంలో గుంటూరు తూర్పులో ప్రస్తుతం వైసీసీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా కుమార్తె ఫాతిమాకు సీటు ఇప్పించుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ముస్తఫా… మూడోసారి తన కుమార్తె రూపంలో విజయం సాధించాలని చూస్తున్నారు. మరోవైపు ఇక్కడ టీడీపీ కూడా ముస్లిం అభ్యర్థికే సీటు ఇవ్వడంతో హోరా హోరీ పోరు కన్ ఫా అని అంటున్నారు.

ఇదే క్రమంలో పక్కనున్న కృష్ణా జిల్లా పెడనలో మాజీ మంత్రి కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్‌ టీడీపీ తరఫున బరిలోకి దిగుతుండగా.. వైసీపీ దివంగత సీనియర్‌ నేత ఉప్పాల రామ్‌ ప్రసాద్‌ కుమారుడు రాము వైసీపీ తరఫున పోటీ పడుతున్నారు. దీంతో… ఈసారి పెడనలో రాజకీయం యువనేతలతో హోరెత్తిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక బందరు విషయానికొస్తే… ప్రస్తుత ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వైసీపీ తరఫున బరిలో ఉండగా, టీడీపీ తరఫున మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు అల్లుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా బిగ్‌ ఫైట్‌ తప్పదని అంటున్నారు. ఈ పోటీ పేర్ని నానికి ప్రిస్టేజ్ ఇష్యూ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక పామర్రులో టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్‌ రాజా బరిలో ఉన్నారు. అదేపార్టీ నుంచి కాకినాడ జిల్లా తునిలో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ పోటీ చేస్తున్నారు.

ఇదే క్రమంలో ఉత్తరాంధ్ర విషయానికొస్తే… శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర శివాజీ కుమార్తె శిరీష టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆమె వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు చేతిలో ఓడిపోయారు. విజయనగరంలో మాజీ కేంద్ర మంతి అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి టీడీపీ తరఫున బరిలో ఉన్నారు.

అదేవిధంగా సీమ విషయానికొస్తే… కర్నూలులో మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ కుమారుడు టీజీ భరత్‌ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. పత్తికొండలో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇదే క్రమంలో… అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు.

శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్‌ రెడ్డి.. చంద్రగిరిలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమారుడు మోహిత్‌ రెడ్డి, తిరుపతిలో ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కుమారుడు భూమన అభినయ్‌ రెడ్డి బరిలో ఉన్నారు. ఇలా ఈ సారి పెద్ద ఎత్తున వారసులు బరిలోకి దిగుతుండగా… వీరు ఏ మేరకు సత్తా చాటబోతున్నారనేది ఆసక్తిగా మారింది.