పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలకు జీవం పోసిన నవరస నట సార్వభౌముడు సత్యనారాయణ ఇక లేరంటేనే చిత్రసీమ యావత్తు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో తనదైన శైలిలో నటించి మెప్పించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో నేడు (23 డిసెంబర్-2022) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్రసీమ మరో సీనియర్ నటుడిని కోల్పోయినట్లయింది. 1935 జులై 25న జన్మించిన సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లా, కౌతవరం మండలం, గుడ్ల వల్లేరు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఆయన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, ది గుడివాడ కళాశాల (ఏఎన్ఆర్ కళాశాల) నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు
1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సత్యనారాయణ 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రల్లో దాదాపు 777 చిత్రాల్లో నటించారు. కళామతల్లికి ఎంతో సేవ చేసి.. భారత పార్లమెంటు సభ్యుడుగా రాజకీయంగా కూడా పేరు తెచ్చుకున్నారు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో సత్యనారాయణ ఒకరు. 1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన ఆయన తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు . నంది అవార్డు , రఘుపతి వెంకయ్య అవార్డు లాంటివెన్నో ఆయనను వరించాయి. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు.
తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. అతన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ ‘సిపాయి కూతురు’ అనే సినిమాలో ఆయనకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గుర్తించటానికి ఆసక్తి గల కారణం, అతను రూపు రేఖలు యన్.టి.ఆర్‌ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడా ఇతన్ని గమనించారు. 1960లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఈయనకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.
సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది బి.విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనకదుర్గ పూజా మహిమలో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో అతను ప్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.
ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. అతను యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడి గా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా! ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలను చాలావరకు సత్యనారాయణ పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు సాంఘికాల్లో రౌడీ, కథానాయకుని (కథాకనాయిక) తండ్రి, తాత మొదలైనవి.
సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించారు. 1996లో రాజకీయాల్లోకి వచ్చిన సత్యనారాయణ మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
కైకాల సత్యనారాయణ నటించిన సినిమాల విషయానికొస్తే… సిపాయి కూతురు (1959) (మొదటి సినిమా). లవకుశ (1963), పాండవ వనవాసం (1965), పరమానందయ్య శిష్యుల కథ (1966), ప్రేమనగర్ (1971), తాతా మనవడు (1973), నిప్పులాంటి మనిషి (1974) – షేర్ ఖాన్, జీవన జ్యోతి (1975), సిరిసిరిమువ్వ (1976), సెక్రటరీ (1976), చక్రధారి (1977), దాన వీర శూర కర్ణ (1977) – భీముడు, యమగోల (1977) -యముడు, శుభలేఖ (1982) – అంకెల ఆదిశేషయ్య
శ్రుతిలయలు (1987) – వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, రుద్రవీణ (1988), నారీ నారీ నడుమ మురారి (1990) – జానకిరామయ్య, సూత్రధారులు (1990) – నీలకంఠయ్య, గ్యాంగ్ లీడర్ (1991) – జైలర్, భైరవ ద్వీపం (1994), ముద్దుల ప్రియుడు (1994), యమలీల (1994) – యముడు, ఘటోత్కచుడు (1995)- ఘటోత్కచుడు, సాహసవీరుడు – సాగరకన్య (1996), సూర్యవంశం (1998), శుభాకాంక్షలు (1998) – సీతారామయ్య, సమరసింహారెడ్డి (1999), మురారి (2001), అరుంధతి (2009), నరసింహుడు (2005) తదితర సినిమాల్లో నటించిన ఆయన నిర్మాతగా ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలు నిర్మించారు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, జీవితకాల సాఫల్య పురస్కారాలు, నంది అవార్డులు, ఉత్తమ చలన చిత్రం – బంగారు కుటుంబం (1994), రఘుపతి వెంకయ్య అవార్డు – 2011లతో పాటు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు, కళా ప్రపూర్ణ , నవరస నటనా సార్వభౌమ తదితర వార్డులెన్నో ఆయనను వరించాయి. ఇప్పటి వరకు ఆయన 777 సినిమాల్లో విలక్షణమైన పాత్రలను పోషించారు. అందులో 28 పౌరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రక చిత్రాలున్నాయి. 200 మందికి పైగా దర్శకులతో పనిచేసిన అనుభవం కైకాల సత్యనారాయణది. ఆయన నటించిన 223 సినిమాలు 100 రోజులు ఆడాయి, 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి, 10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి, 10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడాయి.
విలక్షణ నటనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కైకాల సత్యనారాయణ మరణం చిత్రసీమకు తీవ్రలోటు.