భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం కోసం ఎంతకైనా సాహసిస్తుందనేది పచ్చి వాస్తవం. త్రుటిలో అధికారం తప్పిపోయిన రాష్ట్రాల్లో తమ ప్రభుత్వం ఏర్పడేలా చేయడానికి బీజేపీ ఎన్ని ఎత్తులు, ఎన్ని లాబీయింగ్స్ చేసిందో అందరికీ తెలుసు. గతేడాది కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎన్నో రిసార్ట్ రాజకీయాలు నడిపి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి కుమారస్వామి సర్కారును నిలువునా కూల్చి యడియూరప్పను ముఖ్యమంత్రిని చేసుకుంది. తమిళనాడులో కూడా రజనీకాంత్ లాంటి వారిని తమవైపుకు తిప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇలా తమకు ఏమాత్రం ప్రయోజనముంటుందని తెలిసినా వెనుకాడకుండా తన శక్తులతో రాజకీయం చేస్తుంది.
కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అవకాశం వచ్చినా ఏమీ చేయకుండా మౌనం వహించింద బీజేపీ. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది. దీంతో వ్యవహారంలో వేలు పెట్టి శక్తి యుక్తులను ప్రదర్శించే అవకాశం బీజేపీకి వచ్చింది. ఎన్నో సందర్భాల్లో గవర్నర్ పదవిని మేనేజ్ చేసి ప్రయోజనాలను పొందిన చరిత్ర బీజేపీకి ఉంది. బీజేపీ మాత్రమే కాదు కాంగ్రెస్ కూడా అలాంటి చర్యలు చేసింది. అది సర్వసాధారణం. ఈ ప్రక్రియను ఎంతో అవసరం అనుకుంటే తప్ప వాడరు. ఒకరకంగా ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. కానీ ఉల్లంఘించినట్టు తెలీకుండా పని జరుపుతారు.
అందుకే మూడు రాజధానుల బిల్లు విషయంలో కూడా రాజ్యాంగ పరంగా ఏమీ చేయలేరు కాబట్టి బీజేపీ రాజకీయం నడిపి గవర్నర్ ఆమోదం తెలపకుండా చేస్తుందని ఆశ పెట్టుకున్నారు. నిజంగా బీజేపీ గనుక బిల్లును అడ్డుకోవాలి అనుకుంటే సెలక్ట్ కమిటీ, కోర్టు కేసులు, విభజన చట్టం ఇలా ఏదో వంక చూపి అడ్డుకునేదే కానీ అడ్డుకోలేదు. ఎందుకంటే అడ్డుకుని ప్రయోజనం లేదు కాబట్టి. ఒకవేళ అడ్డుకుంటే బిల్లును ఆపిన క్రెడిట్ మొత్తం తన అనుకూల మీడియాతో టీడీపీ కొట్టేస్తుంది. అడ్డుకున్న బీజేపీ మేమే లొసుగులు పట్టి ఉద్దేశ్యపూర్వకంగా బిల్లును ఆపేశాం అని చెప్పలేరు. ఎలాగూ కేడర్, నేతలు, సంస్థాగత బలం లేదు కాబట్టి వారికి ఇమేజ్ పెరగడం, ఓటు బ్యాంకు బలపడటం లాంటి అద్భుతాలేవీ జరగవు. అందుకే ఆయాసపడి అడ్డుకునే బదులు మౌనంగా ఉంటే పోతుందిలే అనే కిక్కురుమనకుండా కూర్చుంది.