వరదలో బురద రాజకీయం.. ఇంతకీ ఎవరు నేరస్తులు.?

చిత్తూరు సహా కడప, అనంతపురం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మూడు జిల్లాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. టెంపుల్ సిటీ తిరుపతి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. తిరుమల కొండపైనా, తిరుమల కొండ కింద తిరుపతి నగరంలోనూ.. భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు హయాంలో నిర్లక్షమని వైసీపీ.. వైసీపీ హయాంలో చేతకానితనం అంటూ టీడీపీ.. రాజకీయ బురద ఒకరిపై ఇంకొకరు చల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, బాధితుల వెతలకు కారణమెవరన్నదానిపై మాత్రం ఆత్మవిమర్శ ఎవరూ చేసుకోలేకపోతున్నారు.

అనూహ్యంగా కురుస్తున్న వర్షాలతోనే ఈ దుస్థితి.. అని చెప్పడం చాలా తేలిక. కానీ, వరద నీరు తనంతట తానుగా వెళ్ళిపోయే మార్గాలపై ఆక్రమణలు ఎవరి పాపం.? ఇంకెవరిది, ఆ ఆక్రమణల్ని చూసీ చూడనట్టు వదిలేసిన అధికారులు, అధికారంలో వున్న రాజకీయ పార్టీలదే.

ఇటీవలి కాలంలో నదుల్లో ఇసుక బంగారమైపోతోంది. విచ్చలవిడిగా నదుల్లో ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో.. నదీ తీర ప్రాంతాలన్నీ గుల్లగా మారిపోతున్నాయి. తిరుపతి సహా కడప, అనంతపురం జిల్లాల్లో వరదల నేపథ్యంలో ఇదే అంశపై ఇప్పుడు తాపీగా చర్చ షురూ అయ్యింది.

డ్రైనేజీల ఆక్రమణ.. చెరువుల ఆక్రమణ, నదీ తీరాల ఆక్రమణ.. ఎటు చూసినా ఆక్రమణలే. మరి, వరద నీరు ఎక్కడికి పోవాలి.? ఇంకెక్కడికి పోతుంది, జనమ్మీదకే దూసుకొస్తుంది.. ఆ జనాన్నే ముంచెత్తుంది. ‘ఎన్నికల వేళ ఇంటింటికీ వచ్చి ఓట్లడుక్కునే నేతలు.. తాము వరదల్లో నిండా మునిగిపోతే పట్టించుకోవట్లేదు’ అంటూ జనం వాపోతున్నారు.

ఓట్లేసేటప్పుడు తమ ఓటుని అమ్ముకోకుండా, తమక్కావాల్సిన మౌళిక సౌకర్యాల విషయంలో రాజకీయ నాయకుల్ని ఓటర్లు నిలదీసిననాడు ఇలాంటి దుస్థితి దాపురించదు.