బెయిల్ వచ్చినా, రఘురామకృష్ణరాజు విడుదల ఎందుకు ఆలస్యమవుతోందిట.? ఈ మాత్రం దానికి బెయిల్ కోసం అంతలా కంగారు పడటమెందుకు.? ఇలాంటి ప్రశ్నల చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ (రెబల్) రఘురామకృష్ణరాజుని ఏపీ సీఐడీ అరెస్టు చేయడం, ఆ తర్వాత ఆయన శరీరంపై గాయాలు ఏర్పడటం, బెయిల్ కోసం హైకోర్టులో, ఏపీ సీఐడీ కోర్టులో ప్రయత్నించి విఫలమయ్యాక, సుప్రీంకోర్టును ఆశ్రయించి ఊరట పొందడం ఇవన్నీ తెలిసిన సంగతులే. బెయిల్ అయితే వచ్చిందిగానీ, ఇంకా రఘురామ విడుదల కాలేదు. ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు మరో నాలుగు రోజులు వైద్య చికిత్స కొనసాగనుందట. అదే అసలు సమస్య.
రాజకీయ నాయకులు, అరెస్టయి.. ఆసుపత్రులకు వెళ్ళి వైద్య చికిత్స పొందడమంటే, జైలుని తప్పించుకోవడమేనన్న భావన అందరిలోనూ బలంగా వుంది. ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారం వేరు, ఆర్మీ ఆసుపత్రి లెక్క వేరు కదా. అక్కడే రఘురామ వ్యూహం బెడిసికొట్టిందని అనుకోవాలేమో. ఎటూ బయటకొచ్చాక పెదవి విప్పడానికి లేదు రఘురామకి. ఎందుకంటే, మీడియాతో మాట్లాడొద్దని సర్వోన్నత న్యాయస్థానం బెయిలిచ్చేముందు కఠినమైన షరతు విధించింది. కాబట్టి, రఘురామ విడుదలై ఇంట్లో వున్నా ఒకటే, ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ఒకటే. ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి సమ్మరీ వస్తే, ఆ తర్వాత సీఐడీ కోర్టు, బెయిల్ మీద విడుదల చేయడంపై నిర్ణయం తీసుకుంటుందట. ఇందు కోసం మరో నాలుగు రోజుల సమయం పడుతుందట. ఈలోగా ఏమైనా జరగొచ్చు.. అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న వాదన. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ, ఆ పార్టీ మీదనే గత కొద్ది కాలంగా బురద చల్లుతోన్న విషయం విదితమే. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం ద్వారా రఘురామ కోరి కష్టాలు తెచ్చుకున్నట్లయ్యింది.