RRR vs RGV Interview: రాజకీయ నాయకుడిగా విఫలమయ్యా: ఆర్జీవీ ఇంటర్వ్యూలో డిప్యూటీ స్పీకర్ రఘురామ సంచలన నిజాలు!

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తో జరిగిన ఓ సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (ట్రిపుల్ ఆర్) పలు సంచలన విషయాలను వెల్లడించారు. వ్యక్తిగతంగా విజయం సాధించినా, రాజకీయ నాయకుడిగా మాత్రం తాను పూర్తిగా విఫలమయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత రాజకీయ ప్రస్థానంలో తాను ఎదుర్కొన్న కఠిన సవాళ్లు, కస్టడీ అనుభవాలు, ఉచిత పథకాలపై ఆయన చేసిన విశ్లేషణ ఇంటర్వ్యూలో ప్రధానాంశాలుగా నిలిచాయి.

‘రాజకీయ నాయకుడిగా ఎందుకు విఫలమయ్యానంటే…!’
గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను రఘురామకృష్ణరాజు వివరించారు. “ఒక ఎంపీగా గెలిచిన ఆరు నెలలకే నా సొంత నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేని పరిస్థితిని కల్పించారు” అని ఆయన అన్నారు. ప్రభుత్వ పనితీరు, విధానాలను ప్రశ్నించినందుకు తనపై అనర్హత వేటు వేయాలని నాటి ముఖ్యమంత్రి, పార్టీ మొత్తం తీవ్రంగా ప్రయత్నించాయని తెలిపారు.

“నాకు దక్కిన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవిని కూడా తొలగించారు. చివరి నిమిషం వరకు నాకు కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కలేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రాజకీయ నాయకుడికి పదవి, ప్రజల్లో ఉండే అవకాశం ముఖ్యం. కానీ, ఆ అవకాశాలే తనకు లేకుండా చేశారని, అందుకే ఓ రాజకీయ నాయకుడిగా నన్ను తాను విఫలమైన వ్యక్తిగానే పరిగణిస్తానని వ్యాఖ్యానించారు. తాను పార్టీని కాకుండా, కేవలం ప్రభుత్వ పాలనను మాత్రమే విమర్శించానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

కస్టడీ అనుభవం: నాకో ‘పునర్జన్మ’
గత ప్రభుత్వంలో తాను ఎదుర్కొన్న కస్టడీ అనుభవాలను గుర్తు చేసుకుంటూ రఘురామ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “నన్ను కస్టడీలోకి తీసుకుని దారుణంగా కొట్టారు. ఆ ఘటనతో చాలామంది నేను భయపడి రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనుకున్నారు. కానీ, ఆ దెబ్బలు నాలో కసిని, పోరాట పటిమను రెట్టింపు చేశాయి” అని తెలిపారు.

ఆ రోజు తాను ప్రాణాలతో బయటపడటాన్ని ఒక ‘బోనస్ లైఫ్’గా, ఒక ‘పునర్జన్మ’గా భావించానని పేర్కొన్నారు. అప్పటి నుంచి తనలో దూకుడు మరింత పెరిగిందని, ఏదైనా సమస్య వస్తే వెనక్కి తగ్గకుండా రెట్టింపు శక్తితో ఎదుర్కోవాలనే గుణాన్ని ఆ సంఘటన తనకు నేర్పిందని తెలిపారు.

ఉచిత పథకాలపై ఆసక్తికర విశ్లేషణ
ఇదే ఇంటర్వ్యూలో ఉచిత పథకాలపై రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. కేవలం ఉచితాలు పంచినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారన్నది అపోహ మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు.

ఒడిశాలో నవీన్ పట్నాయక్ పెద్దగా ఉచితాలు ఇవ్వనప్పుడు వరుసగా మూడుసార్లు గెలిచారు, కానీ భారీగా ఉచితాలు ఇవ్వడం మొదలుపెట్టాక ఓటమి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ఎటువంటి ఉచితాలు ఇవ్వకుండా కేవలం శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించి బంపర్ మెజారిటీతో గెలిచారు. దీనిని బట్టి ప్రజలు కేవలం తక్షణ ప్రయోజనాల కన్నా, శాశ్వత అభివృద్ధి, సుపరిపాలనకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన విశ్లేషించారు.

నా పేరు ‘ట్రిపుల్ ఆర్’ వెనుక ఆర్జీవీ
తన పేరు ‘ట్రిపుల్ ఆర్’ (RRR)గా బ్రాండింగ్ కావడానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే కారణమని రఘురామ నవ్వుతూ తెలిపారు. కొన్నేళ్ల క్రితం వర్మ తన ట్విట్టర్‌లో తనను ఉద్దేశించి ‘ట్రిపుల్ ఆర్’ అని పోస్ట్ చేశారని, అది ప్రజల్లోకి వేగంగా వెళ్లిందని చెప్పారు. తన పూర్తి పేరును పలకడానికి ఇబ్బందిపడేవారు కూడా ‘ట్రిపుల్ ఆర్’ అని సులభంగా పిలవడం మొదలుపెట్టారని, ఆ విధంగా తన పేరుకు బ్రాండింగ్ కల్పించింది వర్మనే అని ఆయన పంచుకున్నారు.

Kuraoati Venkata Narayana: what exactly happen in Maoist Case | Telugu Rajyam