ఇప్పటిదాకా ఆసుపత్రుల దోపిడీ, ఇకపై విద్యా సంస్థల దోపిడీ.

Private Schools and Colleges Begins The 'Loot

Private Schools and Colleges Begins The 'Loot

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచేశాయ్. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల వంతు వచ్చినట్టుంది. దోపిడీ షురూ అయ్యింది. వేలల్లో లక్షల్లో ఫీజుల్ని గుంజేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు. ‘ప్రైవేటు టీచర్లు రోడ్డను పడ్డారు మహాప్రభో..’ అంటూ ఓ పక్క ఆందోళనలు వినిపిస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మరి, విద్యార్థుల తల్లిదండ్రులు కడుతున్న ఫీజులు ఏమైపోతున్నాయ్.? కరోనా మొదటి వేవ్ సమయంలోనే, విద్యా సంస్థలు అదనపు వసూళ్ళకు పాల్పడకూడదని ప్రభుత్వాలు హెచ్చరించాయి. కానీ, దోపిడీ మాత్రం ఆగలేదు.

ఇప్పుడు ఇంకోసారి ప్రభుత్వాల అల్టిమేటం జారీ చేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలకి. కానీ, ఆగుతాయా.? ఛాన్సే లేదు. ప్రత్యక్ష విద్యా బోధన లేకపోయినా గత ఏడాది యూనిఫాం పేరుతో వసూళ్ళకు పాల్పడ్డాయి విద్యా సంస్థలు నిర్లజ్జగా. ఇప్పుడూ అదే పరిస్థితి. పుస్తకాలు, పెన్సిళ్ళ దగ్గర్నుంచి.. దోపిడీ నిస్సిగ్గుగా కొనసాగిస్తూనే వున్నాయి. ఫీజులు ముక్కుపిండి మరీ వసూలు చేయడం అన్నది షరామామూలే. ఇంతకీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్.? ఇంకేం చేస్తాయ్.. నిద్దరోతాయ్. అధికారులు, ఆయా ప్రైవేటు విద్యా సంస్థల్లో సోదాలు నిర్వహించరు.. విద్యార్థుల తల్లిదండ్రుల్ని సంప్రదించరు.. రాజకీయ నాయకుల సంగతి సరే సరి.

చాలామంది రాజకీయ నాయకులకి విద్య అనేది ఓ గొప్ప వ్యాపారం. దాంతో, విద్యా సంస్థలకు వంత పాడటం మామూలే. ఎలా చూసుకున్నా.. కరోనా వైరస్, ప్రైవేటు ఆసుపత్రులకీ.. ప్రైవేటు విద్యా సంస్థలకీ వరంగా మారినట్టుంది. సాధారణ వైద్యంతో లక్షలు, కోట్లు గడించే అవకాశాన్నిచ్చింది కరోనా వైరస్, ప్రైవేటు ఆసుపత్రులకి. చదువు చెప్పకపోయినా.. లక్షల్లో ఫీజులు దోచేసే అవకాశం ప్రైవేటు విద్యా సంస్థలకి కరోనా వైరస్ ఇచ్చిందని అనుకోవాలేమో.