కరోనా వైరస్ పట్ల మరీ అంతలా భయపడాల్సిన అవసరం లేదు.. కాస్త ధైర్యంగా వుంటే, కరోనా మహమ్మార్ని తేలిగ్గానే జయించొచ్చు.. అని వైద్య నిపుణులు చెబుతున్న విషయం విదితమే. సరే, కరోనా వైరస్ మీద ధైర్యంతో గెలిచేస్తాం.. కానీ, కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా మారుతున్న కొన్ని ‘ఆసుపత్రుల దోపిడీ’ అనే వైరస్ మీద ఎలా గెలవగలం.? ఇదే ఇప్పుడు చాలామందిని వేధిస్తోన్న ప్రశ్న. కరోనా చికిత్స పేరుతో ప్రజల్ని దోచెయ్యొద్దంటూ ప్రభుత్వాలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి ఆసుపత్రుల యాజమాన్యాలకి. కానీ, దోపిడీ మాత్రం యధేచ్ఛగా కొనసాగుతోంది.
రెమిడిసివిర్ ఇంజెక్షన్ 3 వేల రూపాయల ధర వుంటే.. దాన్ని 30 నుంచి 50 వేలకు ఆసుపత్రుల యాజమాన్యాలే బ్లాక్ మార్కెట్టుకి తరలించి విక్రయిస్తున్న వైనం దాదాపుగా ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తూనే వుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది, బయటకు వచ్చిన రోగుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తే, ఏ స్థాయిలో వాళ్ళంతా దోపిడీకి గురయ్యారో తెలుస్తుంది. అధికారిక లెక్కలు లక్ష, లక్షన్నరగా వుంటే.. అసలు దోపిడీ పది లక్షల నుంచి పదిహేను లక్షలు ఆ పైన వుంటోంది. మరి, ప్రభుత్వాలు నిర్దేశించిన ధరలకు వైద్య చికిత్స ఎందుకు దక్కడంలేదు.? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ప్రభుత్వాసుపత్రులు నిండిపోవడంతో, ప్రైవేటు ఆసుపత్రులే దిక్కవుతున్నాయి కొందరికి. ఏపీలో అయితే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య చికిత్స అందాల్సి వున్నా, అక్కడా దోపిడీ తప్పడంలేదన్న విమర్శలున్నాయి. కరోనా వైరస్.. చాలామందిని ఆర్థికంగా చిదిమేస్తే, బ్లాక్ మార్కెట్లో మెడిసిన్స్ విక్రయించేవారికి, కరోనా చికిత్స అందిస్తోన్న ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రం కాసుల పంట పండించేస్తోంది.