ఇప్పుడంతా మర్చిపోయినట్లైన కరోనా మళ్లీ కదలికలోకి వస్తోంది. దేశవ్యాప్తంగా తాజాగా నమోదైన కొవిడ్ కేసులు ప్రజలను మరోసారి అప్రమత్తం చేస్తున్నాయి. మే 19 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య పెద్దదిగా అనిపించకపోయినా, గత కొన్ని వారాల వ్యవధిలో ఇది స్వల్ప పెరుగుదల కావడం ఆరోగ్య శాఖను దృష్టి సారించేల చేసింది.
ఇప్పటికే కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కేసులు మళ్లీ తలెత్తుతుండగా, హాంకాంగ్, సింగపూర్‌లలో జేఎన్.1 వేరియంట్ వల్ల భారీగా కేసులు పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. జేఎన్.1 అనే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఏ.2.86లోని జన్యు మార్పుల నుంచి పుట్టింది. దీనిలోని ప్రత్యేక మ్యూటేషన్ వల్ల ఇది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను చాలా సులభంగా దాటుకుంటుంది.
సాధారణ లక్షణాలు జ్వరం, పొడి దగ్గు, తలనొప్పి, రుచి కోల్పోవడం, డయేరియా లాంటివే అయినప్పటికీ, వ్యాప్తి రేటు వేగంగా ఉండడం దీనిలోని ప్రధాన భయం. ఇప్పటికే ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 అనే వేరియంట్లు జేఎన్.1 నుంచి ఉద్భవించినవే కావడం, అవి విదేశాల్లో కేసులను పెంచడమే కాకుండా భారత్‌కు కూడా రావచ్చన్న భయం మరింత పెంచుతోంది.
ఇదిలా ఉంటే, కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ప్రస్తుతం భారత్‌లో కేసుల తీవ్రత తక్కువగానే ఉందని, ఆసుపత్రుల్లో చేరే స్థితి లేదని స్పష్టం చేసింది. అయినా జాగ్రత్త తప్పదని, ప్రజలు కొవిడ్ నియమాలను పాటిస్తూ అవసరమైన వేళ మాస్క్‌లు ధరించాలని సూచిస్తోంది. వైరస్ ఆకృతి మారుతోందని గుర్తించి ముందే అప్రమత్తమైతేనే భవిష్యత్తులో మళ్లీ పెద్ద స్థాయిలో వ్యాప్తిని నిరోధించవచ్చు. కరోనా పోరాటం ముగిసిందనుకోవడం కాకుండా, ఇంకా స్మార్ట్‌గా ఎదుర్కొనాల్సిన బాధ్యత మనదే.