Political Budget : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొద్ది సేపట్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు లోక్‌సభలో. ఈ బడ్జెట్ ఎలా వుండోబోతందన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడం మామూలే. ‘మాకేంటి.?’ అని సమాజంలో వివిధ వర్గాలు బడ్జెట్ గురించి ఆలోచించడమూ సర్వసాధారణమే. జనాల అంచనాల్ని తల్లకిందులు చేయడమే బడ్జెట్ తాలూకు ప్రధాన లక్షణమైపోయింది.
ప్రజా బడ్జెట్ అనే మాట ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది. నడుస్తున్నదంతా పొలిటికల్ ట్రెండ్. బడ్జెట్టుకి రాజకీయ రంగు పూసేయడం గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. కార్పొరేట్లను ఉద్ధరించడం లేదంటే ఎన్నికలు జరిగే అవకాశమున్న రాష్ట్రాల్లో రాజకీయ లబ్దికి అనుకూలంగా మార్చడం.. ఇదీ గత కొంతకాలంగా బడ్జెట్ రూపుదిద్దుకుంటున్న తీరు.
ఇప్పుడూ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో, దీన్ని రాజకీయ బడ్జెట్టుగానే చూడాలి. రాజకీయం పేరు చెప్పి ప్రజా బడ్జెట్టుని విస్మరించినా, కార్పొరేట్లకు లబ్ది చేకూరే అంశాలు మాత్రం ఖచ్చితంగా వుండి తీరతాయి. ఎందుకంటే, కార్పొరేట్ల ఉద్ధరణ కోసమే దేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప, ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం కానే కాదు.
కార్పొరేట్ సంస్థలకు పోర్టులు, ఎయిర్ పోర్టులు అమ్మేయడమే అభివృద్ధిగా ప్రభుత్వాలు చెప్పుకుంటున్న రోజులివి. కోవిడ్ 19 నేపథ్యంలో బాగుపడ్డవి కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రమే. ఆ కార్పొరేట్ ఆసుపత్రులతో కార్పొరేట్ మెడికల్ మాఫియా.. అనగా, అత్యంత కీలకమైన అత్యవసర మందులు అలాగే ఆక్సిజన్ వంటివాటిని తమ గుప్పిట్లో పెట్టుకున్న నరరూప రాక్షసుల మాఫియా కూడా బాగు పడింది.
ఎటూ బడ్జెట్ పేరు చెప్పి, పేద వర్గాలకు విదిలింపులు వుంటాయనుకోండి.. అది వేరే సంగతి. ఇంతకీ పన్నుల మోత సంగతేంటి.? దానికి బడ్జెట్టే అవసరమా.? ఎప్పుడు కావాలంటే అప్పుడు వాయించేయడానికి జీఎస్టీ కౌన్సిల్ వుండనే వుంది కదా.?
సో, ఈసారి బడ్జెట్టుని పొలిటికల్ కార్పొరేట్ పద్దుగా అభివర్ణించడం తప్పేమీ కాదు.