Question Modi : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి కేంద్రాన్ని నిలదీయగలవా.?

Question Modi :  పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ బడ్జెట్ నుంచి చాలా ఆశపడ్డాయి. బడ్జెట్‌లో తమకు సరైన కేటాయింపులు వుండాలంటూ అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్.. తమదైన ప్రయత్నాలు చేసి భంగపడ్డారు.

మరిప్పుడు కేసీయార్ అయినా, వైఎస్ జగన్ అయినా ఏం చేస్తారు.? పార్లమెంటులో తమ ఎంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తారా.? వైసీపీ, టీఆర్ఎస్ ఎంపీలే కాదు, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇతర పార్టీల ఎంపీలూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సందర్భమిది.

నిజానికి, పార్లమెంటు సమావేశాలకు ముందర తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అఖిలపక్ష సమావేశాల్ని ఏర్పాటు చేసి వుంటే బావుండేదేమో. ఎందుకంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, రెండు తెలుగు రాష్ట్రాలకూ కేంద్రం విభజన చట్టం ద్వారా చేయాల్సినవి చాలానే వున్నాయి. కానీ, అవేవీ కేంద్రం చేయడంలేదు.

ఈ లెక్కన, రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలూ ఒక్కతాటిపైకి రాకపోయినా, ఆయా రాష్ట్రాల్లోని ఎంపీలైనా పార్టీలకతీతంగా తమ తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒక్కతాటిపైకి రావాలి.

బడ్జెట్ అస్సలేం బాగాలేదని మీడియాకెక్కి ప్రకటనలు చేస్తున్న ఆయా పార్టీల ఎంపీలు, బడ్జెట్ మీద చర్చ సందర్భంగా ఎలా వ్యవహరిస్తారు.? తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సమస్యలపై తెలుగు ఎంపీలు ఎలా గళం విప్పగలరు.? వేచి చూడాల్సిందే.