ఏపీకి పదేళ్లుగా రాజధాని లేదు. సరే..! ఇప్పుడు కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అదీ సరే..! అయితే ఆ మోడీ సర్కార్ నిలబడింది, కాలం వెళ్లదీస్తుందీ మాత్రం ఏపీ ప్రజల పుణ్యంతోనే. ఏపీలో ప్రజలు కూటమి మాటలు మరోసారి నమ్మింది. ఏకంగా 16 మంది టీడీపీ, ఇద్దరు జనసేన ఎంపీలను అందించింది. పైగా.. వీరు తప్పుకుంటే ప్రభుత్వం ఢమాల్ అంటుంది!
మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమికి ఇంత ఆదరణ ఇచ్చిన ఆంధ్రుల రుణం ఎలా తీర్చుకోవాలి? దీనిపై అసలు చంద్రబాబు, పవన్ లు ఎంతగా డిమాండ్ చేయాలి? అయితే… అలాంటివి ఏమీ లేవు! దీంతో… ఆంధ్రుల రుణాన్ని రుణం తోనే తీర్చుకుంటుంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ ఏపీలోని టీడీపీ.
అవును… తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు కేంద్రం ప్రకటించింది అంటూ సంబరాలు చేసేస్తున్నారు టీడీపీ, జనసేన నేతలు. అంటే వారిని వారు మోసం చేసుకుంటున్నారా.. లేక, ఏపీ వాసులను మరోసారి మోసం చేయాలనుకుంటున్నారో తెలియదు కానీ… అది కేంద్ర సాయం కాదు.. అప్పులు తీసుకోవడానికి అనుమతి సాయం అనే నిజాన్ని సంబరాల చాటున దాయాలనుకుంటున్నాట్లున్నారు!
దీంతో… ఇక అమరావతి నిర్మాణం పరుగులు పెడుతుందని ఒకరంటే.. కేంద్రం సాయం హర్షణీయం అని ఇంకొకరు అంటున్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఇంకొకరు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. సరిగ్గా గమనిస్తే… నిర్మళా సీతారామన్ చెప్పింది… ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి పర్చడానికి 15,000 కోట్ల రూపాయలను “సమకూర్చుకోవడానికి” సహకరిస్తామని!
అంటే… ప్రపంచ బ్యాంక్ అనుబంధ సంస్థల నుంచి అప్పు తీసుకోవడానికి సహకరిస్తామని. అంటే… అది అక్షరాలా అప్పే అన్నమాట! ఇదే విషయంపై స్పందించిన కేంద్రమంత్రి… ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో ఉందని చెబుతూనే… రూ.15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి తెప్పిస్తున్నామని తెలిపింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇస్తుందే తప్ప ఉచితంగా ఇవ్వదు!
ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. ఈ ప్రకటన అనంతరం స్పందించిన చంద్రబాబు… కేంద్ర బడ్జెట్ ఏపీకి అన్ని విధాలా తోడ్పాటు అందించే విధంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడితో ఆగని ఆయన… అమరావతి రాజధానికి నిధులు ఏ రూపంలో ఇచ్చినా తీసుకుంటామని చెబుతున్నారు. ఈ అప్పులను తీర్చేది 30ఏళ్ల తర్వాతే అని చంద్రబాబు అంటున్నారు.
అంటే… అమరవాతి రాజధానికి కేంద్రం ఇచ్చేది సాయం కాదు రుణం అనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసన్నమాట. ఇలా అప్పు అని, 30 ఏళ్ల తర్వాత తీరుస్తామని చంద్రబాబు చెబుతున్నప్పుడు ఇక సాయం అనే మాటకు అర్ధం ఎక్కడుందని నిలదీస్తున్నారు ఏపీ ప్రజానికం. ఏది ఏమైనా… ఈ రోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటానికి కీలక సాయం చేసిన ఏపీ ప్రజల రుణాన్ని కేంద్రం ఇలా రుణంతోనే తీర్చుకుంటుందనే కామెంట్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.