పోలవరం తలనొప్పి వైసీపీకి తగ్గేదెలా.?

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుది బండలా మారిపోతోంది. రాష్ర్టానికి జీవనాడి అవ్వాల్సిన పోలవరం ఎందుకిలా గుదిబండ అవుతోంది.? అంటే దానికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. జాతీయ ప్రాజెక్టు కనుక మొత్తం నిధులు తామే ఇస్తామని బీజేపీ చెబుతూ వస్తోంది. మాటలేమో కోటలు దాటేస్తున్నాయ్. చేతలేమో గడప కూడా దాటడం లేదు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా, అంచనా వ్యయంపై కేంద్రం కోతలు విధిస్తున్నా, కేంద్రాన్ని గట్టిగా నిలదీసే సాహసం చేయలేకపోతోంది. నిజానికి గతంలో అధికారంలో ఉన్న టీడీపీది కూడా ఇదే దుస్థితి. అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా ఏమీ మారలేదు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీ, అప్పట్లో టీడీపీని విమర్శించింది. ఇప్పుడు టీడీపీ అదే పని చేస్తోంది.

తాజాగా పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేయబోయే మొత్తంపై కేంద్రం చేతులు దులిపేసుకోవడంతో, పోలవరం ప్రాజెక్టు భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. వైసీపీ ఎంపీలంతా కేంద్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ ఈ విషయమై చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అన్నట్లు తయారైంది వారి పరిస్థితి. కాగా, వైసీపీ ఎంపీల బృందం, తాజాగా కేంద్ర జలశక్తి మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా పోలవరంపై నెలకొన్న నిధుల గందరగోళానికి తెర దించాలని కేంద్ర మంత్రిని కోరారు వైసీపీ ఎంపీలు. అయితే, ఈ విషయమై కేంద్రం తరపున ఎవరూ మీడియా ముందుకొచ్చి, వైసీపీ ఎంపీలకూ, తద్వారా రాష్ర్టానికి భరోసా ఇవ్వలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం, పోలవరం భారాన్ని మోయలేదు. అలాగని ప్రాజెక్టును మధ్యలో వదిలేయనూ లేదు. మరెలా.? రాష్ర్ట ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి అధికార వైసీపీకి కేంద్రం తెచ్చిపెట్టేలా ఉంది. కేంద్రాన్ని వైసీపీ ఇప్పటికైనా గట్టిగా నిలదీయకపోతే, రాజకీయంగా వైసీపీ తీవ్రంగా నష్టపోతుంది.