PK Enters In Telangana : తెలంగాణ రాజకీయాల్లోకి ‘పీకే’ ఎంట్రీ.! వాట్ నెక్స్‌ట్.?

PK Enters In Telangana : తెలంగాణ రాజకీయాల్లోకి పీకే ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితితో జత కట్టారు. ప్రకాష్ రాజ్‌తో కలిసి పీకే, తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను అత్యంత రహస్యంగా వుంచేందుకు గులాబీ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది.. కింది స్థాయిలో రాజకీయం ఎలా నడుస్తోంది.? ఇలాంటి అంశాలపై పీకే, ప్రకాష్ రాజ్‌తో కలిసి తెలుసుకుంటున్నారు.
ఎవరీ పీకే.? పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు.. ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో, పీకే టీమ్ గత కొంతకాలంగా తెలంగాణలో కింది స్థాయిలో పరిస్థితుల్ని అధ్యయనం చేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం దిశగా ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్, తెలంగాణ రాష్ట్ర సమితి కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. పీకే టీమ్ ఇప్పటికే చేపట్టిన సర్వేలకు సంబంధించి విశ్లేషిస్తోన్న పీకే, తానే స్వయంగా రంగంలోకి దిగారు.. వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుంటున్నారు.
అదేంటీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ కోసం పని చేయాల్సిన ప్రశాంత్ కిషోర్, తెలంగాణ రాష్ట్ర సమితి కోసం పని చేస్తున్నారు.? అన్న ప్రశ్న సహజంగానే చాలా మందిలో మెదులుతుంటుంది.
2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెరవెనుక సహాయ సహకారాలు అందించింది. ఆ ప్రశాంత్ కిషోర్ సలహాతోనే, తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మూసేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆ పీకే సలహాతోనే, షర్మిల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు. ఆ ప్రశాంత్ కిషోరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు కోసం రంగంలోకి దిగారు.
అద్గదీ ప్రశాంత్ కిషోర్ రాజకీయం. అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్, వైఎస్ జగన్.. ఇప్పుడు కేసీయార్.. తెలంగాణలో పీకే, రాజకీయ వ్యూహాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎలా వుంటాయో ఏమో.!