పెట్రో పాపం నరేంద్ర మోడీ ప్రభుత్వానిదే.!

మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను, పెట్రో ఉత్పత్తుల ద్వారా కేంద్రానికి దక్కిన ఆదాయమెంతో తెలుసా.? దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయలట. ఈ విషయాన్ని కేంద్రమే అధికారికంగా వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే, ఈ ఆదాయంలో వృద్ధి 88 శాతమట. అదిరిందయ్యా నరేంద్ర మోడీ.. అనాలనిపిస్తోంది కదా.? దేశమంతా కరోనా విపత్తు నేపథ్యంలో విలవిల్లాడుతోంటే, కేంద్రం సామాన్యుడ్ని దోచెయ్యడానికి పెట్రో మార్గాన్ని ఎంచుకుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందాన కరోనా పాండమిక్ సమయంలో పెట్రో దెబ్బకి సామాన్యుడు మరింతగా విలవిల్లాడుతున్నాడు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగానే దేశంలో పెట్రో ధరలు పెరుగుతున్నాయన్నది కేంద్రం తెరపైకి తెస్తోన్నవింత వాదన. కానీ, దేశంలో పెట్రోల్ వాస్తవ ధర ఎంత.? దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతోన్న పన్నుల భారమెంత.? అని లెక్కలు తీస్తే.. కేంద్రం.. అలాగే రాష్ట్రాలు దోచేస్తున్న వైనం కళ్ళక కట్టినట్లు కనిపిస్తుంది. పెట్రో పోటు.. అంటే, అది కేవలం పెట్రోలు లేదా డీజిల్ వరకూ మాత్రమే పరిమితమైన అంశం కాదు. రవాణా ఖర్చులు తడిసి మోపెడైపోతే.. సామాన్యుడికి అన్ని విధాలా నష్టమే. అయినాగానీ, మోడీ సర్కార్ పన్నుల్ని తగ్గించుకునేందుకు ఇష్టపడటంలేదు. ‘మాది ప్రజా రంజక పాలన..’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే ప్రస్తావిస్తూ వుంటారు. ఏదీ ఎక్కడ.? సామాన్యుడి నడ్డి విరిచేలా పన్నుల భారం మోపే ప్రభుత్వాన్ని ప్రజా రంజకమైన పాలన అందిస్తున్న ప్రభుత్వంగా ఎలా చప్పగలం.? ప్రతిపక్షంలో వున్నప్పుడు బీజేపీకి, పెట్రో ఘాటుపై ఉద్యమాలు చేయాలనిపించింది. అధికారంలోకి వచ్చాక.. పెట్రో పోటుతో సామాన్యుడ్ని టార్చర్ పెట్టాలనిపిస్తున్నట్టుంది. ప్రజలు ఎలా వుండాలి.? అన్న విషయమై లెక్చర్లు దంచడం మానేసి, ప్రభుత్వమెలా పనిచేయాలో బాధ్యత గుర్తెరిగితే మంచిది.