ఏపీలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచుతున్నాయి. విజయవాడలో మొన్నమధ్యన చిన్నారి అనే నర్స్ మీద ఒక ప్రేమోన్మాది పెట్రోల్ పోసి తగులబెట్టాడు. తీవ్ర గాయాలైన ఆ యువతి కన్నుమూసింది. ఆ ఘటన మరువకముందే అదే విజయవాడలో బీటెక్ విద్యార్థిని దివ్యతేజస్వినిని ప్రేమోన్మాది స్వామి బలిగొన్నాడు. అలాగే తిరుపతిలో ఒక పాస్టర్ యువతి మీద అత్యాచారం చేశాడు. ఇలా వరుస ఘటనలతో ప్రతిపక్షాలు, ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ సర్కార్ హడావుడిగా చట్టం చేసి ఇక మహిళల మీద దాడులు జరిగితే సహించబోమని, నేరం రుజువైతే ఉరి శిక్షేనని అన్నారే.. ఆ చట్టం ఏమైంది అంటూ అంతా ప్రశ్నిస్తున్నారు.
గతంలో హైదరాబాద్ శివార్లలో దిశ అనే యువతిని కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. అలాంటి దారుణాలు ఏపీలో జరగకూడదని, జరగనివ్వమని అంటూ అప్పటికప్పుడు దిశ పేరుతో చట్టాన్ని రూపొందించారు. అసెంబ్లీలో ఆమోదం చేశారు. ఖచ్చితమైన ఆధారాలు ఉంటే.. అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు.. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసి.. 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి, దిశ పేరుతో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం, ఒక్కో స్టేషనుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తాం అంటూ పెద్ద హంగామా చేశారు. ఇక వైసీపీ నేతలైతే మహిళా రక్షణ కోసం తమ ప్రభుత్వం మహత్తర చట్టాన్ని తెచ్చిందని దంచికొట్టాయి. పనిలో పనిగా చంద్రబాబు మీద విమర్శలు గుప్పించాయి.
కానీ తీరా నేరాలు జరుగుతుంటే అసలు దిశ చట్టం కింద కేసులు నమోదు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్రం ఏపీ ప్రభుత్వం పంపిన దిశ చట్టాన్ని సవరణలు కోరుతూ వెనక్కు పంపడం దుమారం రేపుతోంది. అంటే ఇన్ని రోజులు దిశ బిల్లు చట్టం కాలేదా, కేవలం బిల్లుగానే ఉండిపోయిందా, అంటే ఇన్నాళ్లు అధికార పక్షం చేసిందంతా పబ్లిసిటీ స్టంటా, బిల్లు చట్టం కాని విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం దిశ బిల్లు ద్వారా ఏపీకి మాత్రమే వస్ర్తించేలా ఐపీసీలో మార్పులు చేయాలని కోరింది. కానీ ఒక రాష్ట్రం కోసం మార్పులు చేస్తే అన్ని రాష్ట్రాలు అడుగుతాయని, అప్పుడు మొత్తం ఐపీసీనే ప్రక్షాళన చేయాల్సి ఉంటుందని, అది సాధ్యంకాదని అంటూ కేంద్ర హోమ్ శాఖ సవరణలు సూచిస్తూ బిల్లును వెనక్కి పంపింది.