ఆంధ్రుల చిరకాల స్వప్నాల్లో పోలవరం ప్రాజెక్ట్ కూడ ఒకటి. రాష్ట్రంలో ఉన్న కరువును దాదాపు తరిమికొట్టగల సత్తా ఉన్నా ప్రాజెక్ట్. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్. విభజన హామీల్లో పోలవరం బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అనే ఒప్పందం కుదిరింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం నిధులు రావడం ఆలస్యమవుతోంది అంటూ రాష్ట్రం తరపున 4000కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగించారు. వాటిని కేంద్రం రీఎంబర్సిమెంట్ చేయాల్సి ఉంది. ఇవి ఇవ్వకపోగా ప్రాజెక్ట్ అంచనా వ్యవయాన్ని సగానికి కుదించేసింది కేంద్ర ఆర్ధిక శాఖ.
పోలవరం తుది అంచనా వ్యయం 55 వేల కోట్లు. అప్పట్లో కేంద్రం కొంత మేర తగ్గించి 47,700 కోట్లకు ఆమోద ముద్ర వేసింది. కానీ ఇప్పుడు అంత మొత్తాన్ని ఇవ్వడం ఇష్టంలేకనో ఏమో కానీ కేంద్రం ఆ అంచనా వ్యయాన్ని 20,398 కోట్లకు కుదించింది. ఇది 203-14 నాటి అంచనా వ్యయం. ఈ అంచనాతో ప్రాజెక్ట్ పూర్తి చేయడం అసాధ్యమే. ఈ మొత్తం పునరావాస పనులకే సరిపోదు. పునరావాస అంచనా వ్యయమే 30 వేల కోట్ల పైచిలుకుగా ఉంది. అలాంటప్పుడు ఆ 20 వేల కోట్లు ఏ మూలకు సరిపోతాయి.
ఇప్పటివరకు పోలవరం మీద రాష్ట్రం 4000 కోట్లు ఖర్చు చేసింది. వాటిని కేంద్రం భర్తీ చేస్తే ఇక రావలసింది 16,398 కోట్లు మాత్రమే. 2014 నుంచి ఇప్పటి వరకూ నాబార్డు నుంచి కేంద్రం రూ.8614.16 కోట్లు చెల్లించింది. ఆ మొత్తాన్ని తీసేస్తే ఇక ఇవ్వవలసింది 8000 కోట్లే. ఇప్పుడు ఈ మొత్తానికే అంగీకారం తెలిపాలని కేంద్రం బలవంతం పెడుతోంది. దీనికి గనుక రాష్ట్రం ఒప్పుకుంటే పోలవరం పూర్తికావడమనేది కలగానే మిగిలిపోతుంది. అందుకే ప్రజలు, ప్రజా సంఘాలు పోలవరం మీద కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వేరేలా ఉంది. సంయమనం పాటించి నిధులు రాబట్టుకోవాలి అంటున్నారు. గతంలో కూడ బాబుగారు ఇలా చేసే ఒట్టి చేతులు, అప్పులు మిగిల్చి వెళ్లారు. ఇప్పుడు వైసీపీ సర్కార్ కూడ శాంతంగా సాధిద్దాం అంటుంటే జనం ఉండబట్టలేకపోతున్నారు. 151 సీట్ల భారీ మెజారిటీటీ గెలిపిస్తే ఇదా చేసేది. అతి ముఖ్యమైన పోలవరం మీద కూడ పోరాడలేకపోతే ప్రజలిచ్చిన అంత మెజారిటీకి అర్థమేముంది. పోరాడితేనే పోలవరం బ్రతుకుతుంది. లేకపోతే ఇంకో దశాబ్దమైనా అలాగే అరకొర నిర్మాణాలతో మిగిలిపోతుంది అంటున్నారు.