పెయిడ్ ఆర్టిస్టులతో వైఎస్ జగన్ సర్కారుకి పెద్ద తలనొప్పి.!

అమరావతి ఉద్యమంలో పెయిడ్ ఆర్టిస్టులు.. ఎయిడెడ్ విద్యా సంస్థల వ్యవహారంలో పెయిడ్ ఆర్టిస్టులు.. ఒకటేమిటి.? అన్ని సందర్భాల్లోనూ ఒకటే గొడవ.. అదే పెయిడ్ ఆర్టిస్టుల రచ్చ. అసలు ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు.? ఎన్నికల వేళ దొంగ ఓట్లు వేసేవారు పెయిడ్ ఆర్టిస్టుల్ని కదా పెయిడ్ ఆర్టిస్టులనాలి.! అధినేత మెప్పు కోసం అడ్డగోలుగా బూతులు తిట్టేవాళ్ళని కదా పెయిడ్ ఆర్టిస్టులనాలి.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, అమరావతి ఉద్యమం వెనుక ఓ బలమైన కారణం వుంది. తప్పో ఒప్పో.. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధానిగా గుర్తింపు పొందింది. ఆ అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారు. కొందరి నుంచి అప్పటి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుని, ‘స్వచ్ఛందం’ అనే ముసుగు కూడా తొడిగింది.

అమరావతి పేరుతో చంద్రబాబు సర్కారు పబ్లిసిటీ స్టంట్లు చేస్తే, ఆ తప్పుని తాము సరిదిద్దుతామనీ, గొప్ప రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామనీ చెప్పిన వైఎస్సార్సీపీ, అధికారంలోకి వచ్చాక అమరావతిని పక్కన పెట్టేసింది. ఇదే అసలు సమస్య.

చంద్రబాబు గనుక అమరావతి పేరుతో భూ కుంభకోణాలు చేసి వుంటే, ఆయన్ని బోనెక్కించగలగాలి. కానీ, అది చేతకావడంలేదు వైఎస్ జగన్ ప్రభుత్వానికి. ఇదే జగన్ సర్కారు వైఖరి పట్ల ప్రజల్లో అనుమానాలు పెరిగేలా చేస్తోంది. వైఎస్ జగన్ – చంద్రబాబు మధ్య అమరావతి నలిగిపోతోంది.

ఈ వ్యవహారంలో మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టుల గోల ఒకటి. పదే పదే రైతుల్ని, ఉద్యమకారుల్ని పెయిడ్ ఆర్టిస్టులని అర్థం పర్థం లేకుండా విమర్శిస్తే, అధికారంలో వున్నవారి పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. నిజంగా పెయిడ్ ఆర్టిస్టులే అయినా, వాళ్ళూ రాష్ట్ర ప్రజలే కదా.. అన్న ఇంగితం అధికార పార్టీలో కొరవడుతోంది.