మూడు రాజధానులు వెనక్కి: వైఎస్ జగన్‌ని అభినందించాల్సిందే.!

ప్రస్తుతానికి మూడు రాజధానుల వ్యవహారం అటకెక్కింది. ఇప్పుడేంటి.? మూడు రాజధానుల అంశం తెరపైకొచ్చినప్పుడే, అందులో అర్థం పర్థం లేదన్న భావన న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమయ్యింది. సామాన్యుడు సైతం, ‘ఒకదానికే దిక్కులేదు, మూడు రాజధానులెలా కడతారు.?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసినా, వైఎస్ జగన్ సర్కారు మాత్రం మూడు రాజధానుల మంత్రం జపించింది.

న్యాయస్థానాల్లో కేసుల కారణంగా మూడు రాజధానుల వ్యవహారంలో కొంత ఇబ్బంది కలిగి వుండొచ్చు. కానీ, ప్రభుత్వ ఆలోచన చిత్తశుద్ధితో కూడుకున్నదైతే, న్యాయస్థానాలు మాత్రం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తాయి.? ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల్ని ‘సలహాదారులు’ పక్కదోవ పట్టించారా.? అసమగ్రమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించారా.? అన్న అనుమానాలు అప్పటినుంచీ ఇప్పటిదాకా వినిపిస్తూనే వున్నాయి.

ఎలాగైతేనేం, మూడు రాజధానుల చట్టాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇకపై రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని.. అదే అమరావతి. మరోమారు అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి సమగ్రమైన బిల్లు తెస్తాం.. అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మంచి ఆలోచనే అది.

రాష్ట్రానికి మూడు రాజధానులూ అవసరమే. మూడేంటి.? జిల్లాకి ఓ రాజధాని తరహాలో అభివృద్ధి చేసినా ఎవరూ కాదనరు. కానీ, అంతకన్నా ముందే ఒక రాజధాని సరైనది వుండి తీరాలి. అదే అమరావతి. అసెంబ్లీ, సెక్రెటేరియట్, హైకోర్టు, మరికొన్ని ప్రభుత్వ భవనాలు అమరావతిలో కొత్తగా నిర్మితమయ్యాయి 2014 తర్వాత. వాటన్నిటినీ సద్వినియోగం చేసుకోవడం ప్రభుత్వ బాధ్యత.

ఇప్పటికైతే మూడు రాజధానుల వివాదానికి శుభం కార్డు పడినట్టే. సీక్వెల్ వస్తుందా.? మళ్ళీ వివాదం రాజుకుంటుందా.? అన్నదానిపై ఇప్పుడు చర్చ అనవసరం. రాష్ట్రానికి అభివృద్ధి కావాలి.. రాజకీయ రచ్చతో రాష్ట్రమే నాశనమైపోతుంది.