AP CM Jagan : మూడు రాజధానులు: సీఎం జగన్ ముందున్న ఏకైక ఆప్షన్ అదే.!

AP CM Jagan

AP CM Jagan :  ‘మా ప్రభుత్వ విధానం వికేంద్రీకరణ.. మూడు రాజధానులు..’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అధికారిక ప్రకటన చేసేశారు. ‘శాసన సభకు చట్టాలు చేసే అవకాశం లేదని ఎవరైనా అనగలరా.? అదెలా సాధ్యమవుతుంది.? శాసన వ్యవస్థలు వున్నదే చట్టాలు చేయడానికి..’ అని కూడా బొత్స సత్యనారాయణ సెలవిచ్చారు.

నిజమే, రాష్ట్రాల స్థాయిలో శాసన సభ, శాసన మండలి.. జాతీయ స్థాయిలో అయితే లోక్ సభ, రాజ్యసభ.. ఇవి చట్టాలు చేయడానికే వున్నది. చట్టాలు చేయొద్దంటే ఎలా.? అమరావతి విషయమై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో, రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయడానికి వీల్లేదని అనలేదు.

విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయాలని పేర్కొన్నప్పుడు, ఆ రాజధానిని ఇప్పటికే నోటిఫై చేసినప్పుడు, దాన్ని మళ్ళీ మార్చుతామనో, అదనంగా రాజధానులు పెడతామనో అంటే కుదరదనీ, దానికి రాష్ట్ర శాసనసభలో చట్టాలు చేస్తే సరిపోదని మాత్రమే హైకోర్టు పేర్కొంది.

విభజన చట్టంలో ‘ఎ క్యాపిటల్’ అని పేర్కొనడాన్ని హైకోర్టు ప్రస్తావించింది. విభజన చేసింది కేంద్రం గనుక, రాజధానిని నిర్ణయించాల్సిందిగా విభజన చట్టంలో కేంద్రమే పేర్కొంది గనుక, ఆ కోణంలోనే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యిందనీ, రాజధానిని మళ్ళీ మార్చాల్సి వస్తే.. కేంద్రమే ఆ పని చేయాలనీ హైకోర్టు పేర్కొంది.

‘అబ్బే, రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశం’ అని కేంద్రం చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ దిశగా కేంద్రం, అవసరమైతే విభజన చట్టంలో సవరణ చేసి, తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఈ విషయంలో కేంద్రాన్ని వైఎస్ జగన్ ఒప్పించగిలిగితేనే, రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పడతాయ్. అది తప్ప మరో అవకాశమే లేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (AP CM Jagan).