రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగడం.. ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాల్ని రచించడం.. వంటి అంశాలపై చూపే శ్రద్ధలో పదో వంతు అయినా, కరోనా వైరస్ మీద పోరాటం చేయడంలో పెట్టి వుంటే, దేశంలో కరోనా వైరస్ ఈ స్థాయిలో ప్రాణ నష్టాన్ని దేశంలో కలిగించి వుండేది కాదేమో. ప్రాణ నష్టం ఒక్కటే కాదు, దేశానికి జరిగిన ఆర్థిక నష్టం అంతా ఇంతా కాదు. కరోనా వేళ, నరేంద్ర మోడీ ఏం చెబితే దేశం అది చేసింది. ఇంటి బయటకు వచ్చి కంచాలు, గరిటెలు పట్టకుని శబ్దం చేయమంటే చేశారు ప్రజలు. కొవ్వొత్తులు వెలిగించారు.. ఇంకా చాలా చాలా చేశారు. ప్రజలు చేసిన త్యాగాల ముందు ప్రభుత్వం చేసిన సాయం చాలా చాలా చాలా చిన్నది. మారటోరియం విషయంలో తప్పటడుగులు, వైద్య సౌకర్యాలు మెరుగుపర్చడంలో అలసత్వం, టీకాల విషయంలో అయితే, మోడీ సర్కార్ డిజాస్టర్.. అని చెప్పొచ్చు.
మే 1వ తేదీ నుంచి 18 – 45 ఏళ్ళ వయసు వారికి వ్యాక్సినేషన్.. అంటూ మోడీ సర్కార్ అత్యంత ఘనంగా ప్రకటించుకుంది. ఏదీ.? ఎక్కడ.? దేశంలో ఆరు రాష్ట్రాల్లోనే ఈ ప్రక్రియ మొదలైంది. ఆ రాష్ట్రాల్లో కూడా వ్యాక్సిన్ లభ్యత సరిగ్గా లేదు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణ రాష్ట్రం ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్ సమకూర్చుకోవడానికి వీలుగా ఆదేశాలు జారీచేసిందిగానీ, ఆ వ్యాక్సిన్లు 45 ఏళ్ళు పైబడినవారికి మాత్రమే. అంటే, ప్రభుత్వం ఇప్పటిదాకా అందిస్తోన్న ఉచిత టీకా, ఇకపై ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చు చేస్తే దొరుకుతుందన్నమాట. రాష్ట్రాలు మాత్రం ఏం చేయగలవు.? కేంద్రం జాతీయ టీకా విధానాన్ని సరిగ్గా తీర్చిదిద్దలేకపోయింది. ఫలితంగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత నెమ్మదిగా సాగుతోంది. నిజానికి, తొలిదశలో యుక్త వయస్కులు పెద్దగా కరోనా బారిన పడలేదు. పడినా వెంటనే కోలుకున్నారు. రెండో దశలో కరోనా వైరస్, యువతనీ బలిగొంటోంది. ప్రధానంగా 18 నుంచి 45 ఏళ్ళ వయసులో వున్నవారు ప్రాణాలు కోల్పోతుండడంతో.. కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. అయినాగానీ, మోడీ సర్కారుకి చీమకుట్టినట్లైనా వుండట్లేదు.