మోడీ మాయ: ప్రజల ఆర్థిక ఇబ్బందులు పాలకులకు పట్టవా.?

Modi Magic: Where Is Maratorium this time?

Modi Magic: Where Is Maratorium this time?

ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి విషయాలపై సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది. రాష్ట్రాలు చేసేది లేక.. తమ పరిధిలో లాక్ డౌన్.. కర్ఫ్యూ వంటి ఆప్షన్లను ఎంచుకోవాల్సి వస్తోంది. అదే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటిస్తే.. కేంద్రానికి కొన్ని ప్రత్యేక బాధ్యతలుంటాయి. అందులో అతి ముఖ్యమైనవి దేశ ప్రజల ఆర్థిక ఇబ్బందులపై సమాధానం చెప్పాల్సి రావడం. గతంలో లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకులు మారటోరియం ప్రకటించాయంటే.. అది కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు మాత్రమే.

కొంతవరకు మారటోరియం ఊరటనిచ్చింది. ప్రధానంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ప్రజలకు మారటోరియం నిజంగానే ఊపిరి పోసింది. కానీ, ఇప్పుడు ఇంకోసారి కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్నా మారటోరియం ద్వారా ప్రజల్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రయత్నించడంలేదు. ఓ వైపు జనం కరోనా దెబ్బకు పిట్టల్లా రాలుతున్నా, బ్యాంకులు రాబందుల్లా మారి కరోనా బాధితుల కుటుంబాల్ని పీక్కుతింటున్న పరిస్థితి కనిపిస్తోందనే విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. ‘ఈఎమ్ఐ సహా లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లుల’ విషయంలో బ్యాంకులు వినియోగదారులపై ఒత్తడి తెస్తున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి, బ్యాంకులకు కేంద్రం భరోసా ఇస్తే, కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే.. బ్యాంకులు సైతం మారటోరియం విషయమై సానుకూలంగా స్పందిస్తాయేమో. కేంద్ర ప్రభుత్వం, లాక్ డౌన్ పెట్టలేదు గనుక, మారటోరియం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనుకుంటే అంతకన్నా బాధ్యతారాహిత్యం ఇంకోటుండదు. కరోనా వల్ల సంభవిస్తోన్న మరణాల కంటే, కరోనా కారణంగా తలెత్తే ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది.. అయితే, ఈ మరణాలు రికార్డుల్లోకి రావడంలేదు.