కరోనా వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. మన దేశం పరిస్థితి కూడా అలాగే తయారైంది. చేతినిండా పనిలేక.. చేతిలో రూపాయి లేక మధ్యతరగతి, పేద ప్రజలు అల్లాడారు.
చాలామంది తమ అవసరాల కోసం తీసుకున్న బ్యాంక్ లోన్ కు సంబంధించిన ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈఎంఐ కట్టకపోతే సిబిల్ స్కోరు తగ్గుతుంది.. దానితో పాటుగా బ్యాంకులు డీఫాల్టర్ గా ముద్ర వేస్తాయి. ఇవన్నీ వినియోగదారుడికి మైనస్ లే.
అందుకే కరోనా సమయంలో బ్యాంకుల్లో తీసుకున్న వివిధ రకాల లోన్ల ఈఎంఐల మీద ప్రభుత్వం మారటోరియం విధించింది. అది గత నెల 31 తోనే ముగిసింది.
కానీ.. ఇఫ్పటికీ కరోనా వల్ల బ్యాంక్ ఈఎంఐలు కట్టలేని పరిస్థితి నెలకొన్నది. అందుకే.. కేవీ కామత్ నేతృత్వంలోని కమిటీ నివేదికను ఆధారంగా చేసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎంఐలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. కమిటీ సిఫార్సులను ఆర్బీఐ అంగీకరించింది.
ఓవైపు ఆర్థిక సంస్థలు, మరోవైపు వినియోగదారుడు.. రెండు వైపులా ఆలోచించి.. అందరికీ లబ్ధి చేకూరేలా.. లోన్ రీస్ట్రక్షరింగ్ స్కీమ్ ను ఆర్బీఐ ప్రవేశపెట్టింది.
లోన్ రీస్ట్రక్షరింగ్ స్కీమ్ అంటే?
దీన్నే రుణ పునర్నిర్మాణం అని కూడా అనొచ్చు. ఇదివరకే తీసుకున్న అప్పులకు సంబంధించి.. నిబంధనలను మార్చడం. వినియోగదారుడు ప్రస్తుతం ఈఎంఐ కట్టలేకపోతే.. రుణ పునర్నిర్మాణ స్కీమ్ ను ఉపయోగించుకోవచ్చు.
ఈ స్కీమ్ ద్వారా లోన్ చెల్లించే కాలపరిమితిని పెంచుతారు. లేదంటే వడ్డీ చెల్లించే వాయిదాలను కూడా మార్చుతారు. అయితే.. సాధారణ సమయాల్లో రుణ పునర్నిర్మాణ ప్రక్రియను వినియోగదారుడు డీఫాల్టర్ అయ్యాక మాత్రమే ఈ స్కీమ్ ను బ్యాంకులు వర్తింపజేస్తాయి. కాకపోతే ఇది కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిన సమయం కాబట్టి.. ఆర్బీఐ ఈ స్కీమ్ ను అన్ని ఆర్థిక సంస్థలకు ప్రతిపాదించింది.
ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది?
ఈ స్కీమ్ ప్రకారం.. బ్యాంకులు లోన్ వ్యవధిని పెంచుతాయి. లోన్ వ్యవధి పెరగడంతో ఈఎంఐ చెల్లించే మొత్తం తగ్గుతుంది. దీని వల్ల తక్కువ ఈఎంఐ చెల్లించేందుకు రుణ గ్రహితకు అవకాశం వస్తుంది. ఇక ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలంటే.. డిసెంబర్ 31, 2020 లోగా సంబంధిత బ్యాంకులో అప్లయి చేసుకోవాలి.