మార్కెట్లోకి కొత్త ఫోన్ వస్తే చాలు కొంతమంది కొనేయాలని అనుకుంటారు. డబ్బులు లేకపోయినా సరే ఈఎంఐల్లో కొనేసి వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం సరిగా ఈఎంఐలు కట్టకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. ఇకపై అలా చేస్తామంటే కుదరదు. ఇలాంటి వారి కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈఎంఐలు చెల్లించకపోతే మొబైల్ ఫోన్ ఆటోమెటిక్‌గా లాక్ అయ్యే విధానం తీసుకురానుంది. దీంతో మీరు ఫోన్ వాడలేరు. త్వరలోనే ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుంది. ఈమేరకు పెండింగ్ రుణాలను రికవరీ చేసేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అధికారం ఇవ్వనుంది. ఇప్పటికే ఈ కొత్త విధానంపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
ముందస్తు అనుమతి తీసుకునేలా ప్రణాళికలు
ఈ విధానంతో మొండి బకాయిలు చెల్లించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే డేటా ప్రొటెక్షన్ కోసం వినియోగదారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకునేలా కూడా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందుకోసం ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ అప్డేట్ చేయనుంది. సూక్ష్మ రుణాల్లో భాగంగా ఎక్కువ మంది మొబైల్ ఫోన్లు కొనుగోగులు చేస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది.
ఫోన్ లాక్ ఎలా చేస్తారంటే..?
రుణం జారీ చేసే సమయంలో మీ ఫోన్లో ఓ యాప్ ఇన్స్టాల్ చేస్తారు. మీరు ఈఎంఐ చెల్లించనప్పుడు ఆ యాప్ ద్వారా ఫోన్ లాక్ చేస్తారు. ఈమేరకు ఫోన్ లాకింగ్కు సంబంధించిన త్వరలోనే ఆర్బీఐ మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఈ నిబంధనతో క్రెడిట్ స్కోరు తక్కువన్నా చిన్న రుణాలు ఇవ్వడం సులభం అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ నిబంధన వల్ల కోట్ల మంది వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని వినియోగదారుల హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
