Unemployment : రిటైర్మెంట్ వయసు పెరిగితే, నిరుద్యోగులు పెరుగుతారా.?

Unemployment : ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి ‘యువతను’ టార్గెట్ చేస్తుంటుంది. ప్రభుత్వ విభాగాల్లో వున్న ఖాళీల్ని భర్తీ చేస్తామని చెబుతుంటుంది. కొత్తగా ఉద్యోగాల కల్పన చేస్తామని చెబుతుంటుంది. అలా చెప్పని రాజకీయ పార్టీ అంటూ దేశంలో ఏదన్నా వుంటుందా.? ఛాన్సే లేదు.

అధికారంలోకి వచ్చాక, అన్ని విషయాల్లోనూ ప్రైవేటీకరణ వైపే చూడటం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరు అధికారంలో వున్నా జరిగేది ఇదే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇందుకు అంతీతమేమీ కాదు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల గురించి పట్టించుకోవడం మానేసింది వైఎస్సార్సీపీ.

జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్‌లెస్ క్యాలెండర్ విమర్శల్ని ఎదుర్కొంది. తాజాగా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచడంతో, నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ‘ఖాళీల్ని భర్తీ చేయరు.. రిటైర్మెంట్ వయసు పెంచుతారు.. ఇంకెలా మాకు ఉద్యోగాలొస్తాయ్.?’ అంటూ నిరుద్యోగ యువతరం నెత్తీనోరూ బాదుకుంటోంది.

వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు. కానీ, తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థ ద్వారా బోల్డంతమందికి ఉద్యోగాలచ్చేశామని వైఎస్ జగన్ సర్కార్ చెప్పుకుంటోన్న విషయం విదితమే. నిజానికి, ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడే యువత ఎంతమంది.? అవకాశాలు దక్కేది ఎంతమందికి.?

లెక్కకు మించి ప్రైవేటు రంగంలోనే ఉపాధి దొరుకుతుంది నిరుద్యోగులకి. కానీ, కరోనా సహా అనేక కారణాలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.. నిరుద్యోగం పెరిగిపోయింది. పొరుగు రాష్ట్రాలకు నిరుద్యోగ యువత వలసపోతోంది. ఇప్పుడీ రిటైర్మెంట్ వయసు పెంపుతో ‘వలసలు’ మరింత పెరిగిపోతాయ్. మరి, ఈ సమస్యకి పరిష్కారమేంటి.? రాజకీయంగా వైసీపీకి ఇదెంత మైనస్ అవుతుంది.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి.