Telangana : ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణని కలిపే కుట్ర జరుగుతోందా.?

Telangana : తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, మంత్రి హరీష్ రావు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణను మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో కలిపేసే కుట్ర జరుగుతోందంటూ హరీష్ రావు తాజాగా చేసి వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అదసలు సాధ్యమయ్యే వ్యవహారమేనా.? అన్న కనీసపాటి ఇంగితం లేకుండా హరీష్ రావు మాట్లాడుతున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.

నిజానికి, కొత్త పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందిగానీ.. ఇదే పాతర రాష్ట్రం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అంటే, పాత పేరుతో కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందన్నమాట. తెలంగాణ నుంచి వేరుపడ్డ ఆ పదమూడు జిల్లాలు తిరిగి తెలంగాణలో కలిసే అవకాశం వుందా.? అంటే, అదీ లేదు. దానికి కారణాలనేకం.

తెలంగాణ – సీమాంధ్ర కలిసి వుండడం వల్ల, తెలంగాణ కాస్తో కూస్తో అభివృద్ధి చెందిందేమోగానీ, ఆంధ్రప్రదేశ్ అయితే పెద్దగా అభివృద్ధి చెందింది లేదు. విడిపోయాక కూడా తెలంగాణనే బాగుపడింది, ఆంధ్రప్రదేశ్ మరింత నాశనమయ్యింది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే కఠోర వాస్తవం.

తెలంగాణలో రాజకీయాలెలా వున్నా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్థితి లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌తో ఇంకా రాజకీయ పార్టీలు ప్రయోగాలు చేస్తూనే వున్నాయి.. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తూనే వున్నాయి.

తెలంగాణని ఆంధ్రప్రదేశ్‌లో కలిపే కుట్ర.. అంటూ ఇరు రాష్ట్రాల్లో మళ్ళీ రాజకీయ రచ్చకు రాజకీయ నాయకులు బీజం వేయడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.