ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకూ… పవన్ కల్యాణ్ పై అటు జనసైనికుల్లోనూ, ఇటు సాధారణ ప్రజానికంలోనూ ఉన్న అభిప్రాయం వేరు! పవన్ కచ్చితంగా రాజకీయాలకు అవసరమైన వ్యక్తి.. ఆయన రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా మార్పు తీసుకొస్తాడు.. ఆయన మార్కు పాలన చూపిస్తాడు.. కచ్చితంగా ఏపీకి మంచి నాయకుడు వచ్చినట్లవుతుంది అని! కారణం… పవన్ కల్యాణ్ స్పీచ్ లు అలా ఉండేవి!
కట్ చేస్తే… ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. మూడు నాలుగు శాఖలకు మంత్రి కూడా అయ్యారు! అయితే… అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ పూర్తిగా మారిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. స్పందించే గుణం పవన్ లో చనిపోయిందా? అనే కామెంట్లు సైతం నెట్టింట దర్శనమిస్తుండటం గమనార్హం. అదీగాకపోతే… బాబు నీడలోఉన్న పవన్ ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నారా?
సినిమాల్లో ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే ఆ సమస్యను తన సమస్యగా భావించిన హీరో… దుర్మార్గులపై విరుచుకుపడతాడు.. ప్రాణాలకు తెగించి పోరాడతాడు.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాడు! పవన్ కల్యాణ్ నిజజీవితంలో కూడా, రాజకీయాల్లో కూడా అలా ఉంటాడని పలువురు భావించారు! ఇక్కడ ఫైటింగ్ లూ గట్రా చేయనవసరం లేదు.. జస్ట్ అధికారులతో మాట్లాడి, బాధితులకు న్యాయం జరిగేలా చేస్తే చాలు!
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ వెలుగులోకి వచ్చినవి నలుగురు మైనర్ బాలికలపై అత్యాచాఆలు! అందులో ముగ్గురు బాలికలు మృతి చెందగా.. వారిలో ఒక బాలిక మృతదేహం 13 రోజులు అయినా ఆచూకీ దొరకలేదు! ఈ నలుగురు పిల్లాలూ పవన్ కల్యాణ్ కుటుంబస్తులు కాదు!! కానీ… “అన్నవరం” సినిమాల్లో లాగా వారంతా తన చెల్లెల్లు అనుకుంటే.. !? పరిస్థితి ఇలా ఉండేదా?
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయి.. కొన్ని వందల మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి.. అదే “గబ్బర్ సింగ్” సినిమాలో పవన్ అయితే… ఈ పాటికి వారందరి అంతూ చూసేవారు, ఆ దుర్మార్గులను మట్టికరిపించేవారు! తనకు తిక్కున్న మాట వాస్తవమే కానీ.. దానికీ ఓ లెక్క ఉందని క్లారిటీ ఇచ్చేవారు!
ఇక ఇటీవల వినుకొండలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అంతా చూస్తుండగా జిలానీ అనే వ్యక్తి, రషీద్ అనే యువకుడిని అత్యంత పాశవికంగా నరికి చంపాడు. ఆ వీడియో పవన్ చూసి ఉండరు! ఆ వీడియో పవన్ చూస్తే… ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుని ఉండేది.. “తమ్ముడు” సినిమాలో తన అన్నను కొడితే అంతలా విరుచుకుపడిపోయిన పవన్… రషీద్ ని తన తమ్ముడు అనుకుంటే…? పరిస్థితి వేరేలా ఉంటుంది!
శాంతిభద్రతలు అంటే ఏమిటో ఏపీ ప్రజలకు చూపిస్తానని పవన్ చెప్పడం.. ఆ మీటింగ్ కు హాజరైనవారంతా చప్పట్లు కొట్టడానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. పవన్ లో ఇప్పటికీ పౌరుషం ఉంది.. అదే వేడి ఉంది.. అదే ఫైర్ ఉంది.. అదే ఆవేశం ఉంది.. ప్రజలకు మంచి చేయాలనే తపనా ఉంది.. కానీ పవన్ ఇప్పుడు చంద్రబాబు నీడలో ఉండటంతోనే ఇలా చేతకాని వాడిగా మిగిలిపోయాడనే ఆవేదన పలువురు జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు.
పైగా ఇప్పుడు కూటమి నుంచి బీజేపీ, జనసేనలు బయటకు పోయినా చంద్రబాబుకు వచ్చిన నష్టం లేదు! హాయిగా పరిపాలించుకోవచ్చు!! కానీ… కూటమి నుంచి బయటకు వస్తే పవన్ పరిస్థితే అధ్వాన్నం అయిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! అందుకే… మాట్లాడాలని ఉన్నా పవన్ మాట్లాడలేడు.. రియాక్ట్ అవ్వాలని ఉన్నా రియాక్ట్ కాలేడు.. నవ్వాలని ఉన్నా కాదు, ఏడ్వాలని ఉన్నా అవ్వని పరిస్థితి. మనిషే మనవాడు.. రిమోట్ మొత్తం అక్కడే!! ఇది సగటు జనసైనికుడి ఆవేదన అంట!!