ప్రస్తుతం ఏపీలో ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య జరిగే చర్చ… కూటమి ఇచ్చిన హామీలు గురించి అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కూటమి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ హామీలనే చెప్పాలి. ఈ క్రమంలో హామీల విషయంలో బాబుని పూర్తిగా నమ్మలేకపోయినా.. పక్కన పవన్ ఉన్నాడనే నమ్మకం కూటమి గెలుపులో కీలక భూమిక పోషించింది.
ఇటీవల శాసన మండలిలో మాట్లాడిన లోకేష్… తల్లికి వందనం పథకంపై సమగ్ర చర్చ జరగాలి, రోడ్డు మ్యాప్ లూ గట్రా వేయాలి, సంఘాలతో చర్చించాలి వంటి కబుర్లు చెప్పుకొచ్చి.. చివర్లో.. ఏడాదికి తల్లికి వందనం లేదు.. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమలుచేసేలా ప్రణాళిక రచిద్దాం అని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో… కూటమి హామీలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది.
అసెంబ్లీలో చంద్రబాబు.. జగన్ కంటే తమ హయాంలో అమ్మిన బీరు కేసులు, క్వార్టర్ బాటిల్లు చాలా ఎక్కువంటూ ఆ లెక్కలు వెంటనే రప్పించుకోగలిగారు కానీ… ఏపీలో ఉన్న తల్లులు, పిల్లల లిస్ట్ మాత్రం తీయలేకపోతున్నాట్లున్నారనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి అందించడం మినహా మరో సంక్షేమ హామీని ఇప్పటివరకూ బాబు & కో అమలు చేయలేదనే చెప్పాలి.
ఇక మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు అంశంపై మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా… సన్నాయి నొక్కులు నొక్కారే తప్ప, వెంటనే అమలుచేస్తామనే బలమైన మాటలు మాట్లాడలేదు. ఇక రైతు భరోసా 20,000 రూపాయల హామీపైనా మాట్లాడిన అచ్చెన్నాయుడు… గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూస్తామని అన్నారు. డేట్ మాత్రం చెప్పలేదు!
ఇలా వరుసగా సంక్షేమ పథకాలపై కూటమి ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు మాత్రం గట్టిగా అరిచిన నేతలు.. అమలు విషయానికి వచ్చే సరికి మాత్రం అసెంబ్లీలో నీళ్లు నములుతున్నారు. అయితే… ఈ విషయాన్ని ఓ వర్గం మీడియా కవర్ చేయాలని చూసినా.. కూటమి నేతల పెర్ఫార్మెన్స్ ను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనే విషయం బాబు & కో లైట్ తీసుకుంటున్నారు!
గతంలో జగన్ సీఎం అయ్యేసరికి ఉన్న రాష్ట్ర బడ్జెట్ రూ.100 కోట్లే అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 15 రోజుల్లోనే పథకాలను అమలుచేశారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పథకాలకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేసి మరీ అమలుచేసిన పరిస్థితి. అయితే… కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడా పథకాల గురించి ఏ విషయం స్పష్టత రావడం లేదు.
తల్లికి వందనం పథకానికి ఏడాది పాటు సమయం పడుతుందంటున్నారు. కానీ… ఎన్నికల సమయంలో ఎలాంటి నిబంధనలు లేకుండానే ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇక 18ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 ఊసేలేదు.. నిరుద్యోగ భృతి రూ.3,000 మాటే లేదు.. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం టాపిక్కే ఎత్తడం లేదు.. వీటిపై ప్రశ్నిస్తాడనుకున్న పవన్ నోరెత్తడంలేదు.. బాబేమో ఖజానా ఖాళీ అంటున్నారు!
వాస్తవానికి ఏపీలో ఖజానా ఖాళీగా ఉందనేది బాబు ఎన్నికల ప్రచారాస్త్రాల్లో ఒకటి. అంటే… ఖజానా ఖాళీ అనే విషయం అందరికంటే ఎక్కువగా బాబుకే తెలుసు.. తెలిసి కూడా బాబు ఏపీ ప్రజలను ఏమార్చారు. జగన్ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించారు.. బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని అలవిగాని హామీలు ఇవ్వలేనని నిజాయితీగా చెప్పారు. రాష్ట్రప్రభుత్వ ఆదాయ, వ్యయాలను నిశితంగా వివరించారు. అదే జగన్ కు శాపమైనట్లుంది!!
ఆ సమయంలోనే ఎంట్రీ ఇచ్చిన బాబు.. రైతులకు ఏడాదికి రూ.20,000 భరోసా అని ప్రకటించారు, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరికీ ఎలాంటి నిబంధనలు, షరతులూ లేకుండా ఒక్కొక్కరికీ రూ.15,000 ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి కూడా ఒకటి రెండు హామీలను తెచ్చుకున్నారు!! దీంతో… జగన్ కి బలంగా ఉన్న గ్రామీణ ప్రాంత ఓటర్ అటు ఆశపడ్డాడు!!
అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్న పథకాలకు టెరమ్స్ పెడుతుంటే.. కొడుకు కండిషన్స్ పెడుతూ కాలయాపన ప్రక్రియకు తెరలేపారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రేక్షకపాత్ర వహిస్తూ అసెంబ్లీలో నవ్వుతూ గడిపేస్తున్నారు.. జనం ఇవేమీ గమనించడం లేదనే భ్రమలో ఉన్నట్లున్నారు! ఏది ఏమైనా… ఇది చంద్రబాబు, పవన్ కలిసి ఏపీ ప్రజలకు పొడిచిన వెన్నుపోటే!! చరిత్ర మరిచిపోని పోటే!!