చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం అనే సంగతి కాసేపు పక్కనపెడితే… కేంద్రంలో చక్రాలు గట్రా తిప్పానని చెప్పుకున్న సంగతి కూడా కాసేపు పక్కనపెడితే… అవేమీ అవసరం లేకుండానే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు, నీతిష్ కుమార్ ల భుజాలపై ఆధారపడి ఉంది. దీంతో… ఇంతకు మించిన సువర్ణావకాశం తమకు రాదని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.
కేంద్రంలో చంద్రబాబుకు ఉన్న పరపతి.. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి టీడీపీ అవసరం అత్యధికంగా ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ త్వరలో విడుదల కాబోతుంది. ఇందులో భాగంగా ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో… 2014 – 19 తరహాలో మరోసారి ఏపీకి అన్యాయం చేస్తారా.. లేక, ఈసారి కచ్చితంగా సాయపడతారా అన్నది ఆసక్తిగా మారింది.
ఒకసారి గతానికి వెళ్తే… రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ – బీజేపీ కలిసి ఏపీలో అధికారంలోకి వచ్చాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ లో ఏపీ అభివృద్ధిలో పరుగులు మామూలుగా ఉండవంటూ అటు బాబు, ఇటు మోడీ కబుర్లు చెప్పుకొచ్చారు. ఆ కబుర్లు ఏపీ ప్రజలు నమ్మారు. కేంద్రంలో బీజేపీలో టీడీపీ మంత్రులు కూడా ఉండేవారు. అయినా సరే కేంద్ర బడ్జెట్ ప్రతీ సారీ దారుణంగా నిరాశపరచేది.
కవరింగ్ ఇచ్చుకోలేక టీడీపీ పెద్దలు నానా తంటాలూ పడేవారు. 2018 తరువాత కేంద్రం నుంచి ఏ రకమైన సాయం అందలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.. తన చేతకాని తనాన్ని ఒప్పుకోకనే ఒప్పుకున్నారు! తాను ఏకంగా 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం లేదని చెప్పుకున్న పరిస్థితి. విభజన వల్ల దారుణంగా దెబ్బతిన్న ఏపీని ఆదుకోవడానికే పొత్తులు పెట్టుకున్నామని.. అయినా సరే ఏపీకి ఎలాంటి సహకారం దక్కలేదని విమర్శించారు.
కట్ చేస్తే… ఇప్పుడు మరోసారి టీడీపీ – బీజేపీ జతకట్టాయి. కేంద్రంలో బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో బాబు కీ రోల్ పోషించారు. ఈ సమయంలో తొలి బడ్జెట్ 23న ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో… చంద్రబాబుపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోన్న తొలి బడ్జెట్ లో ఏపీకి మాగ్జిమం సహకారం అందుతుందని అంతా భావిస్తున్నారు. ఈ లోపు బాబు సన్నాయి నొక్కులు నొక్కారు!
తాజాగా టీడీపీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పారు! ఇందులో భాగంగా… బడ్జెట్ లో కేంద్రం మన రాష్ట్రానికి భారీగా నిధులు ఇస్తుందని ఆశలుపెట్టుకోవద్దని.. కేంద్ర పెద్దలు అలా చేయలేరని.. ఒక రాష్ట్రానికి ఇస్తే మిగిలిన రాష్ట్రాల వాళ్లు మీద పడతారని.. కేంద్రంలోని పెద్దలకు కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పుకొచ్చారని తెలుస్తోంది!
పైగా… ఏ పథకం కింద డబ్బులు అడిగినా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నిధుల ఖర్చు వివరాలను కేంద్రం అడుగుతుందని చెబుతున్నారు బాబు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా నిధుల్ని దారి మళ్లించిందని.. అందువల్ల పథకాలకు కొత్తగా నిధులు వచ్చే అవకాశం లేకుండా పోయిందని అంటున్నారట! దీంతో… ఈ విషయంలోనూ వైసీపీపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగా తన చేతకాని తనాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారని.. ఒప్పుకోకనే ఒప్పుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
దీంతో… ఏపీ ప్రజానికం టీడీపీకి.. కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే స్థాయి బలం ఇచ్చాక కూడా… ఇంకా గత ప్రభుత్వంపై విమర్శలు చేసుకుంటూ బాబు కాలం వెళ్లదీయాలని భావిస్తున్నారని.. ఇంతకు మించిన చేతకాని తనం మరొకటి ఉండదని.. ఈ దెబ్బతో కేంద్రంలో బాబు పరపతి అంతా డ్రామా అని ప్రజలు భావించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు!
మరి ఇలాంటి విమర్శలకు చెక్ పెడుతూ బడ్జెట్ లో ఏపీకి అద్భుతమైన సహకారం లభించేలా బాబు పావులు కదుపుతారా.. లేక, ఇలానే తనది చేతకానితనం అని ఒప్పుకోకనే ఒప్పుకుంటూ, గత ప్రభుత్వంపై విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తారా అనేది వేచి చూడాలి!