ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4వేలకు పెంచడం మినహా మరో సంక్షేమ పథకం ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల్లో తామేమీ హామీలు ఇవ్వలేదన్నట్లుగా.. జనం ఏమీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎదురుచూడటం లేదు అన్నట్లుగా.. తమను ఈ విషయంలో ప్రశ్నించేవాడెవడూ లేడు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటుందనే కామెంట్లు ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి.
కూటమి అధికారంలోకి వచ్చాక ప్రధానంగా స్కూల్స్ స్టార్ట్ అయ్యే సమయానికి అందాల్సిన తల్లికి వందనం అందలేదు.. ఇక నారుమడులు వేసుకునే రైతన్నలకు సమయానికి అందాల్సిన రూ.20,000 సాయం అందలేదు.. క్రాప్ ఇన్సూరెన్స్ ఊసేలేదు.. ప్రధానంగా తుఫాన్ల సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లడానికి వీలు ఉండదు.. ఆ సమయంలో ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుందని జగన్ తెచ్చిన మత్య్సకార భరోసా ఇవ్వలేదు!
ఇలా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ శ్వేతపత్రాలు పేరు చెప్పి, గత ప్రభుత్వంపై బురద జల్లుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప… సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసే ఆలోచన చేయడం లేదనే చర్చ ప్రజానికంలో ఇప్పటికే బలంగా మొదలైపోయింది. ఈ సమయంలో… మండలిలో లోకేష్ చావు కబురు చల్లగా చెప్పారు. తల్లికి వందనం ఈ ఏడాదికి లేదని, తూచ్ అని అనేశారు.
ఇలా తల్లికి వందనం పథకం అమలు చేయడానికి తమ వద్ద సరైన డేటా లేదన్నట్లుగా సాకు వెతుక్కుని, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా లోకేష్ వ్యవహరించారని అంటున్న నేపథ్యంలో… జగన్ స్పందించారు. ఇందులో భాగంగా… తాను లేకపోయేసరికి ఉన్న రూ.15,000 పోయింది ఇస్తామన్న రూ.15,000 పోయింది.. అని ఫైర్ అయిన జగన్ డేటా ఇచ్చారు!
ఇందులో భాగంగా… అమ్మ ఒడికి పేరు మార్చి తల్లికి వందనం అని పేట్టారు. ఇలా తల్లికి వందనం అని చెబుతూ తల్లికి శఠగోపం పెడుతున్నారు అని జగన్ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో.. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అని చెప్పి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎంతమంది పిల్లలు అనే విషయం పక్కకు పోయి తల్లులు ఎంతమంది అనే టాపిక్ తెచ్చారని.. ఇది మరో మోసం అని అన్నారు.
సరే పోనీ గతంలో తానిచ్చినట్లుగనే రూ.15,000 తల్లికి ఇస్తారా అంటే అదీ లేదు అని చెప్పిన జగన్.. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ఇస్తే… 84 లక్షల మంది పిల్లలకు మేలు జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని.. ఏమన్నా అంటే డేటా డేటా డేటా అంటున్నారని జగన్ తనదైన శైలిలో లోకేష్ & కో ని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే పాఠశాలకు ప్రారంభమయ్యాయని.. ఏ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారో, గ్రామ సచివాలయం సాయంతో ఎంతమంది స్కూళ్లలో చదువుతున్నారు, కొత్తగా ఎంతమంది అడ్మిషన్స్ పొందారు అనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులు డేటా.. డేటా.. డేటా.. అంటారు? ఇప్పటికే రెండు నెలలు అయిపోయింది అని జగన్ నిలదీశారు! ఇంకా ఎన్ని రోజులు డేటా..? అని ప్రశ్నించారు!
ఈ సందర్భంగా… “43 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు ఇది డేటా… 84 లక్షలు ఇంటూ 15,000 ఇది నువ్వు వేయాల్సింది” అని జగన్ క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.