జగన్ కి టైం వచ్చేసింది… 11 పవర్ పెరిగింది!

ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. 40% ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు 11 మాత్రమే వచ్చాయి. దీంతో… ఏపీలో వైసీపీని కూటమి నేతలు, ప్రభుత్వం బంతాడేసుకుంటారనే కామెంట్లు వినిపించాయి. పైగా చంద్రబాబుని జైలుకు పంపినదానికి రివేంజ్ కూడా బాకీ ఉందనే మాటలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జగన్ పవర్ అమాంతం పెరిగిపోయింది!

అవును… గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన జగన్ పార్టీ ఈదఫా 11 స్థానాలకే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ఆలోచన కూడా చేయరనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ కు లేఖ రాసినా.. అది ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అయినప్పటికీ పార్లమెంట్ లో మాత్రం జగన్ కి పవర్ పెరిగింది.

ఏపీ అసెంబ్లీలో వైసీపీ పూర్తిగా చతికిలపడినా… రాజ్యసభలో మాత్రం ఏపీ కోటా నుంచి ఉన్న మొత్తం 11 మంది ఎంపీలూ వైసీపీకి చెందినవారే ఉన్నారు. వాస్తవానికి ఈ 11 మంది అవసరం ఇప్పట్లో బీజేపీకి రాకపోవచ్చు అని చాలా మంది భావించి ఉండొచ్చు కానీ… ఊహించని విధంగా బీజేపీకి ఆ అవసరం పడింది.

ఒక్క మాటలో చెప్పాలంటే… వైసీపీ ఎంపీల మద్దతు లేకుండా బీజేపీ రాజ్యసభలో ఒక్క బిల్లుని కూడా పాస్ చేయించుకోలేదు. అందుకు కారణం… తాజాగా చూస్తే బీజేపీ సభ్యుల బలం పెద్దల సభలో ఒక్కసారిగా తగ్గిపోవడమే. ప్రస్తుతం పెద్దల సభలో బీజేపీ బలం 86కి పడిపోయింది. ఎన్డీయే మిత్రులు అందరూ కలిస్తే 101గా బలం ఉంది.

ప్రస్తుతం రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి సాధారణ మెజారిటీ కావాలీ అంటే 113 మంది ఉండాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో… ఎన్డీయే కూటమికి ఉన్న 101కి వైసీపీకి ఉన్న 11 మంది, అన్నా డీఎంకేకి ఉన్న నలుగురిని కలిపితేనే బీజేపీకి పెద్దల సభలో బిల్లులు గట్టెక్కే పరిస్థితి అని అంటున్నారు. మరోపక్క ఇండియా కూటమికి రాజ్యసభలో మొత్తం 87 మంది ఎంపీల బలం ఉంది.

ఈ నేపథ్యంలో… వైసీపీ ఎంపీల మద్దతు చాలా కీలకం అని అంటున్నారు. లోక్ సభలో చంద్రబాబు మీద ఆధారపడిన బీజేపీకి.. రాజ్యసభలో జగన్ పై ఆధారపడాలి! దీంతో… జగన్ కి టైం వచ్చిందనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం జగన్ కి వచ్చిన ఇబ్బంది ఏదీ లేదనే మాటలూ వినిపిస్తున్నాయి!

మరి ఈ సదావకాశాన్ని జగన్ ఎలా ఉపయోగించుకుంటారు.. దీని ద్వారా ఎలాంటి రాజకీయ వ్యూహాలు చేస్తారు అనేది వేచి చూడాలి.