YS Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా ‘కోరడం’ తప్పు కదా.?

ముఖ్యమంత్రి అవకముందే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో ఆయన గతంలో జైలుకు వెళ్ళారు.. అప్పటినుంచీ విచారణ ఎదుర్కొంటూనే వున్నారు. వ్యక్తిగతంగా న్యాయస్థానం యెదుట కేసుల విచారణ నిమిత్తం హాజరు కావాల్సి వుండగా, ముఖ్యమంత్రి పదవిలో వున్నాను గనుక.. అది సాధ్యం కావడంలేదంటూ కోర్టుకు విన్నవించుకుంటున్నారు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు పొందుతున్నారు.

న్యాయపరంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకున్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడాన్ని తప్పు పట్టలేం. న్యాయస్థానాలూ అందుకు సమ్మతిస్తున్నాయి గనుక, ఇక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తప్పు పట్టడానికి వీల్లేదు.

అయితే, ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తి.. అత్యంత బాధ్యతగా వ్యవహరించాలి. సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన పదవిలో వున్నారు కాబట్టి, కేసుల విచారణకు హాజరయ్యే విషయమై ప్రతిసారీ మినహాయింపు కోరడం సబబు కాదు.

వారంలో నాలుగైదు రోజులపాటు కోర్టు విచారణకు హాజరవడం ఇబ్బందికరమనీ, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలోపెట్టకుంటే, తాను కోర్టుకు హాజరయ్యేందుకు భద్రత పరంగా కూడా ఖర్చు ఎక్కువవుతుందనే విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు విన్నవించారు, పదే పదే అదే విన్నపాన్ని చేయాల్సి వస్తోంది కూడా.

కానీ, ఓ బాధ్యతగల పదవిలో వున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసుల విచారణకు హాజరవడమే హుందాతనం. ‘తప్పించుకు తిరుగుతున్నారు..’ అనే విమర్శలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ఆయన మీదనే వుంది.

వైఎస్ జగన్ మీద నమోదైన కేసులకీ, ముఖ్యమంత్రి పదవికీ అస్సలు సంబంధం లేదు. ముఖ్యమంత్రి అవకముందు నుంచీ కేసులున్నాయి గనుక, వాటి విచారణకు ‘ముఖ్యమంత్రి’ పదవిని సాకుగా చూపి, విచారణను తప్పించుకోవాలని చూడటం ఎంతవరకు సబబు.? అన్నదే చర్చ ఇక్కడ.