CBI: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం.. సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!

phone tapping case

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకోనుంది. బీఆర్ఎస్ కీలక నేతల మెడకు మరింత ఉచ్చు బిగించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఈమేరకు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫార్ములా ఈ-రేస్ అంశాలపై విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఈ మూడు కేసుల్లో సిట్ విచారణ జరుపుతోంది.

ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కేసును సీబీకి బదిలీ చేయనున్నారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో విచారణ సందర్భంగా అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రెటీలు, న్యాయమూర్తులు, ప్రముఖ జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈమేరకు ట్యాప్ అయిన నాయకులను విచారించారు. ఇందుకు సంబంధించి వారి వాంగ్మూలం తీసుకున్నారు.

ముఖ్యంగా ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారి ఆదేశాలతోనే SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. దీని ఆధారంగా విచారణ చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసు కీలకంగా మారింది. మరోవైపు బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం ఈ కేసులో కీలక నేతలను అరెస్ట్ చేయడం లేదని.. తూతూమంత్రంగా విచారణ జరుపుతోందని విమర్శిస్తున్నారు. ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల దృష్ట్యా తమ చేతికి మట్టి అంటకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రముఖ న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించిన రెండు కేసుల్లోకి సీబీఐ ఎంటర్ అయింది. త్వరలోనే దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా సీబీఐ విచారణ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ కీలక నేతలకు ఉచ్చు బిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.