హైద్రాబాద్ గణేష్ నిమజ్జనం.. ఏం జరగబోతోంది.?

హుస్సేన్ సాగర్.. హైద్రాబాద్ నగరానికి సంబంధించి ఓ ల్యాండ్ మార్క్. కానీ, ఆ పేరు చెబితే అందరికీ గుర్తుకొచ్చేది మురుగు కంపు. అయినాగానీ, అను నిత్యం వందలాది మంది వేలాది మంది హుస్సేన్ సాగర్ తీరాన సేద తీరుతుంటారు. గతంలో.. అంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో.. హుస్సేన్ సాగర్ గురించి మాట్లాడుతూ, హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీళ్ళలా మార్చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు.. అందునా, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత సెలవిచ్చారు. అది గతం. అప్పటికీ.. ఇప్పటికీ.. అంటే, గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్ళలో హుస్సేన్ సాగర్ మురుగు కంపు ఏమాత్రం తగ్గలేదు. హుస్సేన్ సాగర్ అనగానే, గణేష్ నిమజ్జనం గుర్తుకురావడం సహజమే. గణేష్ విగ్రహాల నిమజ్జనంతో కాలుష్యం మరింత పెరిగిపోతోందన్న వాదన ఈనాటిది కాదు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎన్ని చేసినా, హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనమయ్యే గణేష్ విగ్రహాల సంఖ్య తగ్గడంలేదు. ఈ ఏడాది కూడా అక్కడే విగ్రహాల నిమజ్జనం షురూ అయ్యింది. అయితే, హైకోర్టు మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాల్ని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని అల్టిమేటం జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాల్ని సవరించాల్సిందిగా కేసీయార్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. అయినాగానీ, కోర్టు నుంచి ఊరట లభించలేదు. ప్రభుత్వం వేరే మార్గం లేకపోవడంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఏడేళ్ళుగా ఎందుకు హుస్సేన్‌సాగర్‌కి ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం కనుగొనలేకపోయిందన్నది కీలకమైన ప్రశ్న ఇక్కడ. నగరంలో చాలా చోట్ల చాలా చెరువుల్లో పెద్ద పెద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. అక్కడా పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడికీ జనం పెద్దయెత్తున తరలి వెళుతున్నారు. కానీ, హుస్సేన్‌సాగర్‌కి వున్న ప్రత్యేకత వేరు. సో, ఈ ఏడాది నిమజ్జనం ఎలా జరుగుతుంది.? వేచి చూడాల్సిందే.