Fitment 23 : ఫిట్మెంట్ 23.. ఇదేం ర్యాగింగ్ జగన్ సారూ.!

Fitment 23 : అన్నిటినీ తనకే ఆపాదించేసుకోవడం చంద్రబాబుకి అలవాటైపోయిందా.? లేదంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయా.? 2014 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలనైతే టీడీపీ అధినేత చంద్రబాబు అధికారాన్ని అడ్డంపెట్టుకుని తనవైపుకు తిప్పేసుకున్నారో.. అంతే మంది ఎమ్మెల్యేలని 2019 ఎన్నికల్లో చంద్రబాబు పొందగలిగారు.. తనతో కలుపుకుని.

అలా 23 నంబర్ విషయమై చంద్రబాబుకి ప్రతిసారీ వైసీపీ నుంచి ‘పోటు’ ఎదురవుతూనే వుంది. సోషల్ మీడియా వేదికగా, చంద్రబాబుకి ఈ 23 నెంబర్ ద్వారా వైసీపీ మద్దతుదారులు చేసే ట్రోలింగ్ ఓ స్థాయిలో వుంటూ వస్తోంది. ముగ్గురు ఎంపీల విషయంలో కూడా ఇలాంటి ట్రోలింగే జరుగుతుంటుంది.

ఇక, తాజాగా ఉద్యోగులకు వైఎస్ జగన్ సర్కారు 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. నిజానికి, 23 పక్కన ‘పాయింట్ల తేడా’ కొంచెం వుందనుకోండి.. అది వేరే సంగతి. కానీ, ఉద్యోగుల ఫిట్మెంట్ విషయంలో కూడా చంద్రబాబుని వైఎస్ జగన్ ర్యాగింగ్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు ప్రచారం షురూ చేశారు.

కాగా, తమ హయాంలో 40 శాతానికి పైగా ఫిట్మెంట్ ఇచ్చామనీ, వైఎస్ జగన్ మాత్రం 23 శాతంతో సరిపెట్టారని టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. ‘ఉద్యోగులు వైసీపీని నమ్మి మోసపోయారు..’ అని టీడీపీ ఎదురుదాడికి దిగుతోంటే, ‘రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో.. ఈ పరిస్థితుల్ని మేం అర్థం చేసుకోగలం.. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..’ అంటున్నారు ఉద్యోగులు.

ఏదిఏమైనా, 23 నంబర్ మాత్రం చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 2023లో మద్యంతర ఎన్నికలు వస్తే.. అప్పుడు టీడీపీ పూర్తిగా గల్లంతైపోతే.. అన్న చర్చ కూడా జరుగుతోందండోయ్.!