వైఎస్ జగన్, పవన్ ఫొటోల నుంచి విబూది రాలుతోందట.!

అధికార పార్టీకి చెందిన అనుకూల మీడియా సంస్థ తాలూకు ఓ వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించిందట.. అందులో ఓ ఆటోపై ముద్రించిన సీఎం వైఎస్ జగన్ ఫొటో నుంచి విబూది రాలుతోందట. అలాగని, ఓ సోషల్ మీడియా పోస్టుని బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరీశ్వరి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పొందుపరిచారు.

ఈ వ్యవహారంపై అధికార వైసీపీ గుస్సా అయ్యింది. నిజమో కాదో తెలుసుకోకుండా ఫేక్ పోస్టులతో దుష్ప్రచారం చేయడం తగదంటూ వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఎటాక్ షురూ చేశారు. అన్నట్టు, వైఎస్ జగన్ ఫొటో మాత్రమే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోతోనూ ఇలాంటి ఫేక్ వేషాలే వేస్తున్నారు కొందరు నెటిజన్లు.

సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దగ్గుబాటి పురంధరీశ్వరిపై ఫేక్ ప్రచారం అభియోగాలతో ఫిర్యాదు చేస్తామంటోంది వైసీపీ అనుకూల మీడియా. మరి, పవన్ కళ్యాణ్ మీద ఫేక్ స్టోరీస్ ప్రచారం చేస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వుంటుందట.?

ఈ ఫేక్ స్టోరీస్ ఎంత రియల్‌గా వుంటాయంటే.. అది అచ్చంగా నిజమే.. అన్నట్లుంటాయ్. అదే వీటి ప్రత్యేకత. విగ్రహాలు పాలు తాగుతున్నట్లు గతంలో పెద్దయెత్తున రచ్చ జరిగింది. ఫొటోల నుంచి బూడిద రాలడం అనే కాన్సెప్టు కూడా కొత్తదేమీ కాదు. అయితే, రాజకీయ నాయకులకు దాన్ని ఆపాదించడమే అసలు సిసలు ట్విస్ట్.

నిజానికి, ఇలాంటివాటిని ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించదు. అయితే, ఆయా పార్టీల మద్దతుదారులు తాము ప్రత్యర్థులుగా భావించే పార్టీల మీద అక్కసుతో ఇలాంటివి చేస్తుంటారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్, వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపడితే ఎలా.?