దళిత బంధు.. గులాబీ పార్టీకి రాజకీయ బంధువవుతుందా.?

తెలంగాణలో అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకాన్ని అమలు చేసి తీరతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుండబద్దలుగొట్టేశారు. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేసీయార్. ఇందుకోసం పెద్దయెత్తున జన సమీకరణ చేపట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే దళిత బంధు పథకం తెరపైకొచ్చిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. దళితుల్ని కేసీయార్ మభ్యపెట్టడం ఇదే తొలిసారి కాదనీ, దళితులకు ముఖ్యమంత్రి పదవి.. అని గతంలో చెప్పిన కేసీయార్, దళితులకు దక్కాల్సిన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారని బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు మండిపడుతున్నాయి. దళితులకు మూడెకరాల స్థలం ఇస్తానన్న కేసీయార్, ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదన్నది బీజేపీ ప్రశ్న.

ఇంకో రెండేళ్ళ లోపు పోయే పదవిని నిలబెట్టుకోవడానికి కేసీయార్ పబ్లిసిటీ స్టంట్లు చేయడం తప్ప, దళిత బంధు పథకం విషయమై ఆయనకు చిత్తశుద్ధి లేదంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాగా, 10 లక్షలు కాదు, 50 లక్షలు దళిత బంధు పథకం కింద ఇవ్వాలంటూ వింత వాదనను తెరపైకి తెచ్చింది బీజేపీ. ‘కేంద్రం 40 లక్షలు ఇస్తే, దానికి తాము ఇస్తున్న పది లక్షలు కలిపి.. దళితులకు అందిస్తామనీ.. ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేకం కూడా చేస్తామని’ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేయడం మరో ఆసక్తికర అంశం. ఇంతకీ, ఈ దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయ బంధువవుతుందా.? ఆ పార్టీ ఇమేజ్ మరింత పెరిగేలా చేస్తుందా.? ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలపై ఈ సంక్షేమ పథకం తాలూకు ఎఫెక్ట్ వుండి తీరుతుంది. కానీ, అది ఎంత.? ఎన్నికల్లోగా మారే రాజకీయ సమీకరణాలు ఎలా వుంటాయి.? అన్నది మాత్రం ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది.