కరోనా వైరస్ దెబ్బకి దేశంలో ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.. గడచిన ఏడాదిన్నర కాలంలో. ఇది అధికారిక లెక్క మాత్రమే. అనధికారిక మరణాల సంఖ్య చాలా ఎక్కువగానే వుండొచ్చని పలు అధ్యయనాలు పేర్కొంటున్న విషయం విదితమే. అయితే, ఇంకా ముప్పు తొలగిపోలేదు. డెల్టా ప్లస్ అంటున్నారు.. ఇంకేవేవో కొత్త పేర్లు పెడుతున్నారు.. కరోనా వైరస్ మ్యుటేషన్లు అవి. అలా ఎన్ని మ్యుటేషన్లు ముందు ముందు రాబోతున్నాయో.. అవెంతమంది ప్రాణాల్ని బలిగొనబోతున్నాయో.
కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోవడం ఓ లెక్క.. కరోనా అనంతర దుష్ప్రభావాల కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి రావడం ఇంకో లెక్క. దేశంలో ఈ రెండో కేటగిరీ మరణాల సంఖ్య తక్కువేమీ కాదు. ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు బలవన్మరణాలుకు పాల్పుడుతుండడం మూడో లెక్క. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేమో అస్సలేమాత్రం తమ బాధ్యత కాదన్నట్టు వదిలేస్తున్నాయి.
వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయంలోనూ, కరోనా టెస్టుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు.. రికార్డుల గురించి మాట్లాడుతున్నాయి. అంతే తప్ప, ప్రజలు గుమికూడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై సరైన ఆలోచనలు చేయలేకపోతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. నిజానికి, అన్నీ ప్రభుత్వమే చేయాలనుకోవడం కూడా తప్పే. ప్రజలకీ బాధ్యత వుంది.
కానీ, ఆ ప్రజలది తప్పనిసరి పరిస్థితి. ప్రభుత్వాలు తమను పట్టించుకోనప్పుడు.. బతుకు పోరాటంలో భాగంగా బయటకు వెళ్ళాల్సిందే.. ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిందే. దేశంలో కరోనా మరణాల కంటే ఆకలి చావులు ఎన్నో రెట్లు ఎక్కువ వుంటాయంటూ పలు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ‘మేం పేదలకు ఉచితంగా రేషన్ అందించేస్తున్నాం..’ అని చెప్పుకుంటున్న మోడీ సర్కార్, ఎంతమంది ఆకలి చావులతో చనిపోతున్నారో మాత్రం లెక్కలు చెప్పడంలేదు. ఆకలి కంటే ప్రమాదకరమైనది ఏదీ లేదు ఈ భూమ్మీద.