కోవిడ్ వసూళ్ళు: ప్రభుత్వాల ఆదాయం అదుర్స్.. సామాన్యుడి బెదుర్స్

అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు.. అస్సలేమాత్రం తగ్గట్లేదు. కరోనా నేపథ్యంలో జనం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంటే, ప్రభుత్వాలు మాత్రం, ఏదో రకంగా సామాన్యుడి నడ్డి విరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. పెట్రో వాత, ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణకు జరీమానాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వ్యవహారాలు సామాన్యుడికి కరోనా పాండమిక్ తర్వాత సరికొత్తగా షాకిస్తున్నాయి. వేగ నియంత్రణ పేరుతో ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు.. ట్రాఫిక్ విభాగాలు.. వాహనదారుల్ని నిలువునా దోచేస్తున్నాయి. ఫేస్ మాస్కుల నిబంధన అయితే, ప్రభుత్వాలకు అత్యద్భుతమైన ఆదాయవనరుగా మారిపోయిందని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ‘దేశం ఆర్థికంగా పుంజుకుంటోంది..’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చావు కబురు చల్లగా చెబుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే మంచిదే.. దాన్ని చావు కబురు అని ఎలా అనగలం.? కానీ, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఖజానా నిండుతోంది.. అదీ జనం జేబులకు చిల్లులేయడం ద్వారా.

కనీసపాటి కనికరం కూడా లేకుండా కేంద్రం, రాష్ట్రాల హక్కుల్ని హరించేస్తోందన్న ఆరోపణ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి వినిపిస్తోంది. రాష్ట్రాల్ని కేంద్రం ఇబ్బంది పెట్టడం అనేది వేరే చర్చ. నేరుగా సామాన్యుడ్ని దోచేసే అనేక వ్యవహారాలకు కేంద్రం, తెరవెనుకాల ‘కొందరికి’ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోంది. ఓ బ్యాంకు ఖాతాదారుడు, మరో బ్యాంక్ ఏటీఎం వినియోగించాలంటే.. ఇకపై బాదుడే బాదుడు.. చెక్ బుక్ వ్యవహారాలకు సంబంధించి కూడా సరికొత్త వాతలు షురూ అవుతున్నాయి. నిజానికి, కరోనా పాండమిక్ సమయంలో.. ఇలాంటి నిర్ణయాల్ని కాస్త వాయిదా వేస్తే.. సామాన్యుడి మీద అదనపు భారం పడకుండా వుంటుంది. మారటోరియం వంటివాటి ద్వారా ప్రజలకు ఊరటనివ్వాల్సిన కేంద్రం.. ఇలా సామాన్యుడ్ని వేపుకుతినేలా బ్యాంకుల్ని ఉసిగొల్పడమేంటి.? ట్రాఫిక్ చలానాల దగ్గర్నుంచి, ఫేస్ మాస్క్ జరీమానాలు.. ఇదిగో బ్యాంకుల దోపిడీ.. ఇదంతా చూస్తోంటే, కరోనా వైరస్ చాలా బెటర్ అనిపిస్తోంది.. ప్రభుత్వాల పాలన కంటే.. అన్నది సగటు జీవుడి ఆవేదన.