ప్రభుత్వాలు తమ బాధ్యతల్ని విస్మరిస్తున్నాయా.? ప్రజారోగ్యాన్ని ప్రైవేటుకి బలిచ్చేస్తున్నాయా.? కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరుతో ప్రైవేటు సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు చూస్తోంటే, వ్యాక్సినేషన్ ప్రైవేటు పరమవుతోందన్న విమర్శలకు బలం చేకూరుతోంది. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ విషయమై కొత్త మార్గదర్శకాలు గతంలోనే జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నేరుగా వ్యాక్సిన్ తయారీ కేంద్రాలనుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిస్తుంది. రాష్ట్రాలూ అదనంగా వ్యాక్సిన్లను వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేయొచ్చు.
ప్రైవేటు ఆసుపత్రులు సైతం వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు అవకాశం కలిగింది. ఇక్కడ అసలు సిసలు మతలబు ఏంటంటే, కేంద్రానికి ఓ రేటు, రాష్ట్రాలకి మరో రేటు, ప్రైవేటు ఆసుపత్రులకు మరో రేటు.. నిర్ధారించాయి వ్యాక్సిన్ తయారీ సంస్థలు. నిన్న హైద్రాబాద్‌లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. ఒకే రోజు 40 వేల మందికిపైగా వ్యక్తులకు వ్యాక్సినేషన్ నిర్వహించారు.. అదీ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో. ధర ఎంతో తెలుసా.? ఒక్కో డోసుకీ 1400 రూపాయలు మాత్రమే. అయినా, జనం పోటెత్తారంటే బయట వ్యాక్సిన్ లభ్యంత ఎంత తక్కువగా వుందో అర్థం చేసుకోవచ్చు.
జనం మామూలుగా చేసే వృధా ఖర్చులతో పోల్చితే 1400 రూపాయలనేది కొందరికి తక్కువే కావొచ్చు. కానీ, సామాన్యుడి పరిస్థితేంటి.? దేశంలో కరోనా వ్యాక్సిన్ లభ్యతపై భిన్నవాదనలున్నాయి. వ్యాక్సిన్ సరిగ్గా అందుబాటులో వుండడంలేదు.. ఇది ఉచిత వ్యాక్సిన్ సంబంధిత విషయం. అదే, డబ్బులు ఖర్చు చేస్తే మాత్రం వ్యాక్సిన్ అందుబాటులో వుంటోంది. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాల్సిన బాధ్యతను కేంద్రం విస్మరించిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?