వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి ఈటెల రాజేందర్ తొలగింపు, తదనంతర రాజకీయ పరిణామాల సంగతెలా వున్నా, తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా టెస్టులు గణనీయంగా తగ్గిపోవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లెువెత్తుతున్నాయి. గతంలోనూ కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.. హైకోర్టు నుంచి పలుమార్లు మొట్టికాయలు తినాల్సి వచ్చింది. మొట్టికాయల నేపథ్యంలో టెస్టులు పెంచిన తెలంగాణ సర్కార్, మళ్ళీ అనూహ్యంగా టెస్టుల సంఖ్య తగ్గించేసింది. ఒకానొక దశలో లక్షా పాతిక వేల టెస్టుల్ని రోజువారీగా చేసిన కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ టెస్టుల సంఖ్యని 70 నుంచి 80 వేల లోపు టెస్టులకే పరిమితం చేయడాన్ని ఏమనుకోవాలి.? ‘టెస్టుల సంఖ్య తగ్గింది కాబట్టి, కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తక్కువగా వున్నట్లు కనిపిస్తోంది.. లక్షన్నర టెస్టులు చేస్తే, దాదాపు 15 వేల కేసులు రోజువారీగా వెలుగు చూస్తాయ్..’ అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఆయన ఇటీవల కరోనా బారిన పడిన నేపథ్యంలో, కరోనా నుంచి ఆయన ఎంతవరకు కోలుకున్నారు.? అధికారిక వ్యవహారాలు ఎంతవరకు సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారు.? అన్నదానిపై స్పష్టత లేదు. కేసీఆర్ మాత్రమే కాదు, ఆయన తనయుడు.. మంత్రి కేటీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇంతటి ప్రత్యేక పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ మీద వేటు వేయాల్సిన అవసరమేంటి.? ఆయన్ని వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించినా, వెంటనే ఆ శాఖకు సమర్థుడైన మరో మంత్రికి అప్పగించకపోవడం వల్లే తెలంగాణలో కరోనా పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోందన్న చర్చ తెలంగాణ ప్రజల్లో జరుగుతోంది. వ్యాక్సినేషన్ విషయంలోనూ తీవ్ర గందరగోళం కనిపిస్తుండడం గమనార్హం. తెలంగాణకి మెట్రో నగరం హైద్రాబాద్ రాజధానిగా వుంది. చెన్నయ్, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో కరోనా విలయ తాండవం చేస్తున్న దరిమిలా, ఆ ప్రమాదం హైదరాబాద్ పైనా పొంచి వుందనీ, కేసీఆర్ కరోనా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలనీ తెలంగాణ ప్రజానీకం కోరుతున్నారు.