అందరికీ ఉచిత వ్యాక్సినేషన్.. అని ఓ వైపు చెబుతూనే, ఇంకో వైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లను అమ్మకానికి పెట్టింది కేంద్రం. 25 శాతం వ్యాక్సిన్లను, వ్యాక్సిన్ తయారీ సంస్థలు ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకోవచ్చని కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వమే, అందరికీ వ్యాక్సినేషన్ ఉచితంగా అందించాలనుకున్నప్పుడు, వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్మకునేలా అవకాశం కల్పించడమెందుకు.? సహజంగానే తలెత్తే ఈ ప్రశ్నకు సమాధానం కేంద్రం వద్ద లేదు.
తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగానే సాగుతోంది. మొదటి డోస్ తీసుకున్నవారు, రెండో డోస్ వేసుకునే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా కోవాగ్జిన్ లభ్యత చాలా తక్కువగా వుంది తెలుగు రాష్ట్రాల్లో. ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం కోవాగ్జిన్ అందుబాటులో వుండడం గమనార్హం. మొదటి డోస్ ఉచితంగా వేసుకున్న చాలామంది, రెండో డోస్ వ్యాక్సిన్ కోసం ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆశ్రయించక తప్పడంలేదు. ఎందుకీ దుస్థితి.? పైగా, కోవాగ్జిన్ ధర వెయ్యి రూపాయల పై మాటే. సెకెండ్ డోస్ మాత్రమే కాదు, కోవాగ్జిన్ మొదటి డోస్ అయినా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉచితంగా పొందడం అనేది గగనమైపోయింది. చిత్రమేంటంటే, పొరుగు రాష్ట్రాల్లో మాత్రం కోవాగ్జిన్ ఉచితంగానే లభ్యమవుతోంది. కేంద్రం, అన్ని రాష్ట్రాలకూ వ్యాక్సిన్లను అవసరాలకు తగ్గట్టుగానే పంపిణీ చేస్తోందా.? లేదంటే, కొన్ని రాష్ట్రాల విషయంలో ప్రత్యేకంగా చూస్తోందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి సాధారణ ప్రజానీకానికి. ప్రైవేటుకి తరలిస్తోన్న వ్యాక్సిన్, ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా అందించేలా చేయాలని కేంద్రానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.