తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులది మొదటి నుండి ఒకటే వ్యూహం. అధికారం కోసం కాకుండా ప్రజల కోసం కష్టపడాలనేది వారి ఎజెండా. అందుకే ఓటు బ్యాంకు రాజకీయాలను వారు తట్టుకోలేకపోయారు. దఫా దఫాకు పార్టీ క్షీణిస్తూ వచ్చి చివరకు అసెంబ్లీలో ప్రాతినిథ్యమనేదే లేకుండా పోయింది వారికి. ప్రజల్లో సానుభూతి ఉన్నా ఓట్లు మాత్రం రాలట్లేదు. తెలుగు రాజకీయాల్లో సానుభూతిని క్యాష్ చేసుకోలేకపోయిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే. గత ఐదేళ్ళలో వారి ఓటు బ్యాంకు కూడ గణనీయంగా పడిపోయింది. అందుకే ఇరు పార్టీలూ స్ట్రాటజీ మార్చాయి. ఇంతకుముందు ఎన్నికలప్పుడే పొత్తుల గురించి ఆలోచించే వారు ఇప్పుడు ఎన్నికలకు మూడేళ్ళ ముందు నుండే తోడును వెతుక్కోవడం స్టార్ట్ చేశారు.
సీపీఐ పార్టీ తెలుగుదేశానికి అనుకూలంగా మారితే సీపీఎం వైసీపీకి వంతపాడింది. ఇప్పటి నుండే వలలు వేస్తే ఎన్నికలనాటికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనేది వారి ప్లాన్. అంతేకాదు ఈ దఫా ఎన్నికల్లో కొన్ని చోట్ల అయినా గెలవాలని నిర్ణయించుకున్నాయి. అందుకు అవసరమైన పొత్తుల పర్వానికి తెరలేపాయి. బహిరంగంగా చెప్పకపోయినా ప్రధాన పార్టీలను కవ్వించాయి. ఈ క్రమంలో తెలుగుదేశం నుండి సానుకూల స్పందన అందుకోగలిగింది సీపీఐ. కానీ వైసీపీని గిల్లాలని చూసిన సీపీఎంకు నిరాశ ఎదురైంది. జగన్ నుండి కనీస స్పందన కూడ రాలేదు. స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినా పట్టించుకోలేదు.
అందుకే తాజాగా సీపీఎం నేతలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సీపీఎం లేఖకు టీడీపీ సత్వరం స్పందించింది. వెంటనే అందుకుని కమ్యూనిస్టులు కూడ జగన్ నిర్ణయానికి వ్యతిరేకమేనని గొంతు పెంచాయి. ఇలా మూడు పార్టీలు ఒకే ట్రాక్ మీదకు రావడంతో చంద్రబాబు వెంటనే పొత్తుల సంకేతాలిచ్చారు. ఎర్రన్నలు కూడ వాటిని అందుకుని ఈసారి ఎన్నికలకు కలిసి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈసారి కాస్త గట్టిగా పట్టుబట్టి కొన్ని స్థానాల్లో బరిలో నిలవాలని చూస్తున్నారట. మరి కూటమి ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి.