YS Jagan : 2024 ఎన్నికల్లోనో, వీలైతే అంతకన్నా ముందే వచ్చే ఎన్నికల్లోనో వైఎస్సార్సీపీని దెబ్బకొట్టి తాను అధికారంలోకి రావాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జాతీయ స్థాయిలో పొలిటికల్ ఈక్వేషన్స్, రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ ఈక్వేషన్స్ విషయమై గత కొద్ది రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో నారా చంద్రబాబునాయుడు మంతనాలు జరుపుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించారాయన. పార్టీ కోసం పనిచేసేవారెవరు.? పార్టీకి వెన్నుపోటు పొడిచేవారెవరన్నదానిపై ఆరా తీయడం మొదలు పెట్టారు చంద్రబాబు. ఈ క్రమంలో కొందరిపై వేటు వేసేందుకూ సిద్ధముతున్నారు టీడీపీ అధినేత. అయితే, అలా చేయడం టీడీపీకే పెద్ద దెబ్బ.. అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందనుకోండి.. అది వేరే సంగతి.
త్వరలో, అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయనున్నారు. సరిగ్గా ఆ సమయం కోసమే చంద్రబాబు ఎదురుచూస్తున్నారు. సహజంగానే ఇలాంటి సందర్భాల్లో అధికార పార్టీలో అసంతృప్తి సెగలు పెరుగుతుంటాయి. దాన్ని క్యాష్ చేసుకునే దిశగా ఇప్పటినుంచే చంద్రబాబు సర్వసన్నద్ధమయ్యారట.
ఎవరెవరికి మంత్రి పదవులు పోతాయ్.? అన్నదానిపై చంద్రబాబు ఇప్పటికే పక్కా సమాచారం సేకరించారని అంటున్నారు. వారికి గాలం వేసే ప్రక్రియ కూడా మొదలైందట. మరోపక్క, పదవులపై ఆశపడి భంగపడే అవకాశం ఎవరికి వుంది.? అన్న విషయమ్మీద కూడా చంద్రబాబు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు వ్యూహాలు ఇలా వుంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా టీడీపీకి ఛాన్స్ ఇవ్వకూడదన్న కోణంలో ముందుగానే అసంతృప్తులను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీకి ఇతర పార్టీలతో పొత్తులుంటాయనీ, జనసేనతో పొత్తు దాదాపు ఖాయమేననీ, బీజేపీతోనూ చర్చలు నడుస్తున్నాయనీ టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.