కేసీఆర్ అడ్డా నుండి జగన్‌కు సూపర్ గుడ్ న్యూస్ 

three capitals
2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు వైఎస్ జగన్ విస్తృతంగా ఓదార్పుయాత్ర చేస్తున్నారు.  యాత్రలో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని మానుకోటలో పర్యటించాలని జగన్ భావించారు.  కానీ అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తోంది.  ఆంధ్రా నాయకులంటే నైజాం జనం నిప్పులు కక్కే పరిస్థితి.  ఆ సమయానికే జగన్ ఓదార్పుయాత్ర అంటూ మానుకోట రైల్వేస్టేషన్ చేరుకున్నారు.  ఆయనతో పాటు కొండా దంపతులు, భూమా నాగిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాలోతు కవిత లాంటి నాయకులున్నారు.  జగన్ యాత్రను ప్రతిఘటిస్తూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున స్టేషన్ క్యాబిన్లోకి రాళ్లు రువ్వారు.  జగన్ వెనక్కి పోవాలని పట్టుబట్టారు.  
 
ఇంతలో ఉన్నట్టుండి ఆందోళనకారుల మీద తుపాకులు పేలాయి.  ఆందోళనకారులు కొందరు తీవ్రంగా గాయపడ్డారు.  కానీ ఆ కాల్పులు పోలీసులే చేశారనే క్లారిటీ లేదు.  పైగా జేఏసీ ప్రతినిధి డోలి సత్యనారాయణ పోలీసులకు పిర్యాదు చేశారు.  పోలీసులు కొండా మురళీ, కొండా సురేఖ, భూమా నాగిరెడ్డి, భూమన, మాలోతు కవిత, నాయిన రాజేందర్ రెడ్డి లాంటి నేతలపై కేసులు నమోదు చేశారు.  ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేసును సీబీసీఐడీకి బదిలీ చేసింది.  మొదట్లో విచారణ గట్టిగానే జరిగింది.  కానీ ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం, కేసుల్లో ఉన్నవారే కొందరు తెరాసలో చేరడం, జగన్ ముఖ్యమంత్రి కావడంతో పరిస్థితులు మారిపోయాయి. 
 
ఆనాడు ఎవరి మీదనైతే ఆందోళన జరిగిందో అదే వైఎస్ జగన్ ఇప్పుడు కేసీఆర్, తెరాసకు మంచి మిత్రుడు.  ఉభయ రాష్ట్రాల్లో కేసీఆర్ అమితంగా ఇష్టపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ ఒక్కరే.  తెరాస క్యాడర్ కూడా జగన్ పట్ల సానుకూలంగానే ఉంటోంది.  అందుకే ఇక ఈ కేసును విచారించి కూడా లాభం లేదని మూసివేయడానికి సన్నద్దం అవుతున్నారు సీబీసీఐడీ అధికారులు.  ఇప్పటికే కేసును ఎత్తివేస్తున్నట్టు సీబీసీఐడీ పిర్యాదిదారు సత్యనారాయణకు లేఖ పంపిందట.  ప్రజెంట్ ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన కూడా మూసివేతకు అభ్యంతరం చెప్పకపోవచ్చు.  ఇది జగన్‌కు ఒకింత ఆనందాన్ని కలిగించే విషయమే.