బీజేపీ-టీఆర్ ఎస్ మ‌ధ్య ఎమ్మెల్సీ వార్

లాక్ డౌన్ స‌డ‌లింపుల‌తో తెలుగు రాష్ర్టాల్లో మ‌ళ్లీ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం అలుముకుంటుంటుంది. రెండు నెల‌లుగా క‌రోనా వైర‌స్ గురించి చ‌ర్చించుకున్న జ‌నం ఇప్పుడు వైర‌స్ గురించి బోర్ కొట్టి ఎన్నిక‌ల గురించి మాట్లాడుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. నేత‌ల మ‌ధ్య మాట‌లు యుద్ధాలు..దానిపై ఖాళీగా ఉన్న జ‌నం డిబేట్లు పెట్ట‌డాలు జ‌రుగుతుంది. తాజాగా నిజ‌మాబాద్ సెంటర్లో ఇప్పుడు కొత్త పంచాయ‌తీ తెర‌పైకి వ‌చ్చింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేళ టీఆర్ ఎస్..బీజేపీ పార్టీల మ‌ధ్య ఎన్నిక‌ల ర‌గ‌డ మొద‌లైంది. ఆ మ‌ధ్య స్థానిక ఎన్నిక‌ల్లో గెలుపు బావుటా ఎగ‌ర‌వేసిన టీఆర్ ఎస్ నిజామాబాద్ ఉప ఎన్నిక‌లోనూ స‌త్తా చాటాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది.

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్ధిగా టీఆర్ ఎస్ నుంచి క‌విత బ‌రిలోకి దిగుతున్నారు. ఎంపీగా చ‌తికిల ప‌డిన క‌విత ఎలాగైనా ఈసారి గెలుపు గుర్ర‌మెక్కాల‌ని గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆమె దాఖ‌లు చేసిన అఫిడ‌విట్లో త‌ప్ప‌డు వివ‌రాలు ఇచ్చార‌నీ బీజేపీ ఆరోపించింది. దీనిపై చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ కు ఆ పార్టీ ప్లోర్ లీడ‌ర్ రామ‌చంద్ర‌రావు ఫిర్యాదు చేసారు. క‌రోనా కార‌ణంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ను వాయిదా వేస్తే దానిని అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం టీఆర్ ఎస్ చేస్తోంద‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. త‌మ పార్టీ కార్పోరేట‌ర్లు, జెడ్ పీటీసీలను ప్ర‌లోభ‌పెడుతున్నారు బీజీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

అయితే వీటిపై టీఆర్ ఎస్ కౌంట‌ర్ వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు త‌గినంత బ‌లం లేక‌పోవ‌డం వ‌ల్లే క‌మ‌ల ద‌ళాలు లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఎద్దేవా చేసారు. ప్ర‌భుత్వ ప‌నితీరు న‌చ్చే త‌మ పార్టీలో చేరుతున్నార‌ని, ఎవ‌ర్నీ ప్ర‌లోభ పెట్టాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌నీ టీఆర్ ఎస్ నేత‌లు బ‌ధులిచ్చారు. మొత్తానికి బీజేపీ- టీఆర్ ఎస్ మ‌ధ్య ఎమ్మెల్సీ యుద్ధ‌మైతే గ‌ట్టిగానే ఉంది. ఇప్పుడు వ్యాఖ్య‌లు నిజామా బాద్ స‌హా ఏపీలోనూ హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ ఫిర్యాదుపై ఎన్నిక‌ల క‌మీష‌న్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.